స్కామ్‌ సొమ్ముతో భూముల కొనుగోలు

11 Oct, 2021 02:16 IST|Sakshi

తెలుగు అకాడమీ కేసులో పోలీసుల గుర్తింపు  

తక్కువ ధరకు కొనుగోలు చేసిన నిందితుడు సాయికుమార్‌ 

9 మంది నిందితులను విచారిస్తున్న సీసీఎస్‌ పోలీసులు 

పరారీలో ఉన్న నలుగురి కోసం ముమ్మరంగా గాలింపు

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు అకాడమీలో చోటు చేసుకున్న రూ.64.5 కోట్ల కుంభకోణంపై దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ డబ్బుల్లో అధిక మొత్తం కాజేసినట్లు ఆరోపణలున్న ప్రధాన సూత్రధారి సాయికుమార్‌ వివాదాస్పద భూములు ఖరీదు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మార్కెట్‌ రేటు కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయనే ఈ పని చేసినట్లు భావిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు అరెస్టు అయిన 14 మందిలో 9 మందిని సీసీఎస్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

పరారీలో ఉన్న మరో నలుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. తెలుగు అకాడమీ అకౌంట్స్‌ అధికారి రమేశ్, ఎఫ్‌డీల విత్‌డ్రాలో దళారులుగా వ్యవహరించిన సాయికుమార్, నందూరి వెంకట రమణ, వెంకటేశ్వర్‌రావు, సోమశేఖర్‌లతో పాటు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్వాన్‌ బ్రాంచ్‌ మాజీ మేనేజర్‌ మస్తాన్‌వలీ, ఏపీ మర్కంటైల్‌ బ్యాంక్‌ చైర్మన్‌ సత్యనారాయణ, మేనేజర్లు పద్మజ, మెహినుద్దీన్‌లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏసీపీ మనోజ్‌కుమార్‌ నేతృత్వంలోని అధికారులు ఈ నిందితులను వేర్వేరుగా విచారిస్తున్నారు. కొన్ని అనుమానాస్పద అంశాలపై మాత్రం నిందితులను కలిపి విచారిస్తూ వాస్తవాలను నిర్ధారించుకుంటున్నారు.  

34 ఎకరాలు, 3 ప్లాట్లు..  
ప్రధాన నిందితుడు సాయికుమార్‌ స్కామ్‌లో తన వాటాగా రూ. 20 కోట్లకుపైగా తీసుకున్నాడని ఇప్పటివరకు గుర్తించారు. ఇతను రూ.5 కోట్లతో పెద్ద అంబర్‌పేట్‌లో 34 ఎకరాల వివాదాస్పద భూము లు కొనుగోలు చేశాడని, ఆ భూముల పత్రాలను కొందరి వద్ద తాకట్టు పెట్టి నగదు తీసుకున్నాడని తెలిసింది. ఇవి తక్కువ ధరకు రావడంతో పాటు భవిష్యత్తులో తాను అరెస్టు అయినప్పటికీ ఈ భూములను పోలీసులు స్వాధీనం చేసుకోలేరనే ఇలా చేసి ఉంటాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

ఈ కేసులో మరో నిందితుడైన వెంకటరమణ కొండాపూర్, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, విశాఖపట్నంలో సుమారు రూ.6.5 కోట్లు వెచ్చించి మూడు ప్లాట్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ ఆస్తులకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులకు అందించనున్నట్లు సమాచారం.ఈ కుంభకోణంలో మరికొందరు నిందితుల ప్రమే యం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న చందానగర్‌ కెనరా బ్యాంకు మాజీ మేనేజర్‌ సాధన పోలీసు కస్టడీ పిటిషన్‌పై కోర్టు సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

వేగంగా ఈడీ విచారణ 
తెలుగు అకాడమీలో కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు విచారణను వేగవంతం చేశారు. హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను శుక్రవారమే కోర్టు అనుమతితో తీసుకున్న ఈడీ, శనివారం చంచల్‌గూడ జైల్లో అకాడమీ ఇన్‌చార్జి అకౌంటెంట్‌ రమేశ్‌ను ప్రశ్నించింది. బ్యాంక్‌ ఎఫ్‌డీల నుంచి డ్రా చేసిన డబ్బును ఎవరెవరు, ఎంతెంత తీసుకున్నారు.. తమ వాటాగా తీసుకున్న డబ్బులను ఏం చేశారన్న అంశాలపై కూపీ లాగినట్టు తెలిసింది.

కాగా, ఈడీ దర్యాప్తు బృందం సోమవారం బ్యాంక్‌ మేనేజర్లను ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. కెనరా బ్యాంక్‌తో పాటు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజర్లను ప్రశ్నించి ఎఫ్‌డీ సొమ్మును ఎక్కడికి తరలించారన్న సంగతిని రాబట్టాలని భావిస్తోంది. అలాగే ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న సాయికుమార్‌ తన వాటాగా వచ్చిన డబ్బును ఎక్కడికి తరలించాడు, ఎక్కడ పెట్టుబడులు పెట్టాడన్న అంశాలను గుర్తించి వాటిని జప్తు చేయాలని ఈడీ ప్రయత్నిస్తోంది.

మరో పక్క ఇద్దరు బ్యాంక్‌ మేనేజర్లు వారి వాటాగా వచ్చిన డబ్బును కుటుంబ సభ్యుల ద్వారా మళ్లించినట్టు సీసీఎస్‌ తన దర్యాప్తులో స్పష్టంచేసింది. ఆ డబ్బులను హవాలామార్గాల్లో తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు మేనేజర్లతోపాటు మిగతా నిందితులను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. 

మరిన్ని వార్తలు