తెలుగు అకాడమీలో రూ.64 కోట్ల గోల్‌మాల్‌..

2 Oct, 2021 02:45 IST|Sakshi

నలుగురు అరెస్టు

యూనియన్‌ బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌తోపాటు ముగ్గురు ఏపీ మర్కంటైల్‌ సొసైటీ అధికారులను అదుపులోకి తీసుకున్న సీసీఎస్‌ పోలీసులు

సూత్రధారులకు సహకరించినట్లు ఆరోపణ

అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డిపై సర్కారు వేటు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని హిమాయత్‌నగర్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే తెలుగు అకాడమీకి చెందిన రూ.64 కోట్ల నిధుల స్వాహా కేసులో హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు శుక్రవారం నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారికి సహకరించిన ఆరోపణలపై యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) చీఫ్‌ మేనేజర్‌ మస్తాన్‌ వలీ, ఏపీ మర్కంటైల్‌ కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌కు చెందిన ఆపరేషన్స్‌ మేనేజర్‌ వి.పద్మావతి, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ సయ్యద్‌ మొహియుద్దీన్‌లను హైదరాబాద్‌లో, చైర్మన్‌/ఎండీ బీవీవీఎన్‌ సత్యనారాయణరావును విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు.

పక్కా పథకంతో డిపాజిట్లు మాయం 
తెలుగు అకాడమీ తన నిధులను వివిధ బ్యాంకులకు చెందిన 20 బ్రాంచ్‌ల్లో ఏడాది ఆపై కాలపరిమితికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చేసింది. ఈ లావాదేవీలను దళారులుగా వ్యవహరించిన ముగ్గురు వ్యక్తులు నడిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి పేర్లు, వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ముందస్తు పథకం ప్రకారం వ్యవహరించిన ఈ త్రయం ఎఫ్‌డీ చేసిన సమయంలోనే ఆ పత్రాలను కలర్‌ జిరాక్సు తీసుకుని తమ వద్ద పెట్టుకున్నారు. మూడు నెలల క్రితం ఎఫ్‌డీలను కాజేయడానికి రంగంలోకి దిగారు. సంతోష్‌నగర్, కార్వాన్‌ల్లోని యూబీఐ, చందానగర్‌ కెనరా బ్యాంక్‌ శాఖల్లోని 12 ఎఫ్‌డీలుగా ఉన్న రూ.64 కోట్లు కాజేయడానికి కుట్ర పన్నారు. అంత మొత్తాన్ని ఖాతాల్లోకి తెచ్చినా నేరుగా డ్రా చేసుకోవడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే దుండగులు తెలుగు అకాడమీ పేరుతో సిద్ధి అంబర్‌బజార్‌లోని ఏపీ మర్కంటైల్‌ కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌లో తెలుగు అకాడమీ పేరుతో ఖాతా తెరిచారు.

ఆ సమయంలో దుండగులు నకిలీ గుర్తింపుకార్డులు, పత్రాలు సమర్పించారు. ఈ సొసైటీ విజయవాడ, రాజమండ్రి, నెల్లూరులతో పాటు నిబంధనలకు విరు ద్ధంగా హైదరాబాద్‌లోనూ ఓ బ్రాంచ్‌ని నిర్వహిస్తోంది. కాగా నకిలీ ఎఫ్‌డీ పత్రాలు, తెలుగు అకాడమీ పేరుతో రూపొందించిన లేఖల్లో అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన ముగ్గురు దుండగులు వాటి ఆధారంగా యూబీఐ కార్వాన్‌ బ్రాంచ్‌లోని రూ.43 కోట్లు, సంతోష్‌నగర్‌ బ్రాంచ్‌లో రూ.10 కోట్లు, చందానగర్‌ కెనరా బ్యాంక్‌ బ్రాంచ్‌లో రూ.11 కోట్లు లిక్విడేట్‌ చేశారు. ఆ నిధు లు నిబంధనలకు విరుద్ధంగా సిద్ధి అంబర్‌బజార్‌లోని అగ్రసేన్‌ కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో ఉన్న సొసైటీ ఖాతా లోకి బదిలీ అయ్యేలా చేశారు. ఆ తర్వాత తెలుగు అకాడమీ పేరుతో సొసైటీలో తెరిచిన ఖాతాల్లోకి సొసైటీ నిర్వాహకుల సహ కారంతో మళ్లించి డ్రా చేసేశారు. దీని నిమిత్తం సొసైటీకి 10 శాతం వరకు కమీషన్‌ ఇచ్చారు. రెండు నెలల వ్యవధిలో ఈ తతంగం పూర్తయింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో వెలుగులోకి.. 
తెలంగాణ–ఏపీ రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులు, ఆస్తుల పంపకంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ సాగింది. గత నెల 14న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ ఆస్తులు, నిధులను నిర్దేశిత నిష్పత్తి ప్రకారం పంపకం చేయాలని స్పష్టం చేసింది. దీంతో వాటి లెక్కలు చూడాల్సిందిగా డైరెక్టర్‌ సోమిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అకాడమీ అధికారులు ఈ నెల 18న బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి గడువు తీరిన, తీరని ఎఫ్‌డీలు రద్దు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే యూబీఐ అ«ధికారులు కార్వాన్‌ బ్రాంచ్‌లో ఉండాల్సిన రూ. 43 కోట్లు అప్పటికే విత్‌డ్రా అయినట్లు తెలిపారు. దీంతో ఇతర డిపాజిట్ల వివరాలు ఆరా తీసిన అకాడమీ అధికారులు సంతోష్‌నగర్‌ బ్రాంచ్‌లో రూ. 10 కోట్లు, చందానగర్‌ కెనరా బ్యాంక్‌ బ్రాంచ్‌లో రూ. 11 కోట్లు కూడా మాయం అయినట్లు తెలుసుకున్నారు.

అయితే అప్పటికే ముగ్గురు సూత్రధారులూ తమ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కుంభకోణానికి సంబంధించి నమోదైన మూడు కేసులను సీసీఎస్‌ ఏసీపీ కె.మనోజ్‌కుమార్‌ దర్యాప్తు చేశారు. శుక్రవారం పద్మావతి, మొహియుద్దీన్, సత్యనారాయణరావులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురితో పాటు మరికొందరి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేశారు. నిబంధనల ప్రకారం ఏదైనా ఎఫ్‌డీ రద్దైనప్పుడు ఆ మొత్తాన్ని డిపాజిట్‌ ఎవరి పేరుతో ఉంటే వారి ఖాతాలోనే డిపాజిట్‌ చేయాల్సి ఉం టుంది. దీనికి విరుద్ధంగా యూబీఐ, కెనరా బ్యాంకు అధికారులు తెలుగు అకాడమీ ఎఫ్‌డీల డబ్బును అగ్రసేన్‌ బ్యాంక్‌లో ఉన్న సొసైటీ ఖాతాలోకి మళ్లించారు. ఈ నేపథ్యంలోనే స్కామ్‌లో వారి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే యూబీఐ కార్వాన్‌ చీఫ్‌ మేనేజర్, సంతోష్‌నగర్‌ బ్రాంచి ఇన్‌చార్జి కూడా అయిన మస్తాన్‌ వలీని అరెస్టు చేసిన సీసీఎస్‌ పోలీసులు, కెనరా బ్యాంక్‌ అధికారుల పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కుంభకోణం సూత్రధారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని సంయుక్త పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి పేర్కొన్నారు.

తెలుగు అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డిపై వేటు 
తెలుగు అకాడమీ నిధుల గోల్‌ మాల్‌ నేపథ్యంలో అకాడమీ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో ఉన్న ఎం.సోమిరెడ్డిని ప్రభుత్వం తప్పించింది. ఆయన స్థానంలో పాఠశాల విద్య కమిషనర్‌ దేవసేనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సోమిరెడ్డిని మాతృసంస్థ అయిన ఓపెన్‌ స్కూల్స్‌ అదనపు డైరెక్టర్‌ బాధ్యతలకే పరిమితం చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. నిధుల గోల్‌మాల్‌పై ప్రభుత్వం ముగ్గురు విద్యాశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ శనివారం ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సి ఉంది. రెండు రోజులుగా వారు అకాడమీ పత్రాలు, లావాదేవీలు, రికార్డులు పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని గుర్తించడంతో పాటు డైరెక్టర్‌పై వేటుకు సిఫారసు చేసినట్టు సమాచారం.    

మరిన్ని వార్తలు