వేధింపులు.. సీరియల్‌ నటి ఆత్మహత్య

9 Sep, 2020 06:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టిక్‌టాక్‌లో పరిచయమైన ఓ వ్యక్తి వేధింపుల కారణంగా టీవీ సీరియల్‌ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. మౌన రాగం, మనసుమమత వంటి పలు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్ హెచ్ 56 బ్లాక్.. సెకండ్‌ ఫ్లోర్‌లో నివాసముంటున్నారామె. కొన్ని సంవత్సరాల క్రితం కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డి (సన్నీ)తో టిక్ టాక్‌లో ఆమెకు పరిచయం ఏర్పడింది. తనకు తల్లిదండ్రులు ఎవ్వరు లేరని చెప్పి శ్రావణితో మరింత దగ్గరయ్యాడతను.

అయితే గత కొద్దినెలల నుంచి ఆమెను వేధించటం ప్రారంభించాడు. అతడి వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యకు చేసుకుంది. కుమార్తె ఆత్మహత్యపై ఆమె తల్లి దండ్రులు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్నీ పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్క చావుకి కారణం అయిన దేవరాజ్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరుడు శివ డిమాండ్ చేస్తున్నాడు. 

మెంటల్ టార్చర్ పెట్టేవాడు
తన కూతురు శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్ కారణమని శ్రావణి తల్లి పాపారత్నం ఆరోపించారు. భాగ్య రేఖ సీరియల్‌లో నటిస్తున్న దేవరాజ్.. తన కూతురు శ్రావణి ద్వారానే సీరియల్స్ లోకి ప్రవేశించాడని చెప్పారు. ‘పరిచయమైన దగ్గరి నుంచి వేధింపులకు గురిచేశాడు. పడుకున్నప్పుడు శ్రావణి సెల్ ఫోన్ ఫింగర్ లాక్ తీసుకుని అందరికి ఫోన్లు చేసేవాడు. నా కూతురిని దేవరాజ్ మెంటల్ టార్చర్ పెట్టేవాడు. గతంలో ఎస్ ఆర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాం. అయినా దేవరాజ్ మారలేదు. పోలీసులు దేవరాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాల’ని పాపారత్నం పేర్కొన్నారు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను దేవరాజ్‌ రెడ్డి తోసిపుచ్చాడు. 

మరిన్ని వార్తలు