నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా?.. వీడియో బయటపెడతా

6 Nov, 2022 08:32 IST|Sakshi
పోలీసులకు పట్టుబడిన నిందితులు

సాక్షి, బెంగళూరు(బనశంకరి): రాష్ట్రంలో హనీట్రాప్‌ దందాలు ఆగడం లేదు. హైకోర్టు ఉద్యోగికి వల వేసిన నగదు వసూలుకు యత్నించిన ముఠాను శనివారం కామాక్షీపాళ్య పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముఠా సభ్యులు అనురాధ, కావ్య, సిద్దరాజులతో పాటు పది మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు.

వివరాలు.... హైకోర్టు ఉద్యోగి జైరామ్‌కు రెండేళ్ల క్రితం అనురాధ పరిచయమైంది. ఆరు నెలల క్రితం ఇంటిలో షార్ట్‌సర్క్యూట్‌తో  వస్తువులు కాలిపోయాయని, డబ్బు అవసరం ఉందని జైరామ్‌ వద్ద అనురాధ రూ. 10 వేలు తీసుకుంది. అక్టోబర్‌ 10న జైరామ్‌కు డబ్బు తిరిగి చెల్లించింది. అనంతరం మళ్లి 25న రూ. 5 వేలు అప్పు అడిగింది. దీంతో జైరామ్‌ అదే రోజు నగదు ఇవ్వడానికి అనురాధ ఇంటికి వెళ్లాడు. అక్కడే జైరామ్‌ హనీట్రాప్‌లో చిక్కుకున్నాడు. 

వల వేసి.. డబ్బుల కోసం డిమాండ్‌
జైరామ్‌కు అనురాధ పరిచయమైన అనంతరం ఓ రోజు ఇంటికి రావాలని పిలిపించుకుంది. రూ. 5 వేల నగదుతో వచ్చిన జైరామ్‌ నగదు ఆమె చేతికి ఇచ్చాడు. అదే సమయంలో ఈ గ్యాంగ్‌ వీడియో చిత్రీకరించారు. అప్పటి వరకు చాటుగా ఉన్న వ్యక్తులు బయటకు వచ్చి బెదిరింపులకు దిగారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నావా అంటూ ముఠాలోని ఓ వ్యక్తి బెదిరించాడు. ఇదే విషయాన్ని ఆ వ్యక్తి జైరామ్‌ భార్యకు ఫోన్‌ చేసి చెప్పాడు.

రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ పెట్టారు. లేదంటే వీడియో బయట పెడతామని హెచ్చరించారు. దీంతో బాధితుడు కామాక్షీపాళ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 10 మంది గ్యాంగ్‌ను శనివారం అరెస్ట్‌ చేశారు. గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు సిద్దరాజు దావణగెరెకు చెందిన వాడు కాగా నగరంలో రౌడీ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై రెండు దోపిడీలతో పాటు పలు కేసులు ఉన్నాయి.     

మరిన్ని వార్తలు