Manipur Student Killing: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు

27 Sep, 2023 05:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్య 

సామాజిక మాధ్యమాల్లో వారి ఫొటోలు వైరల్‌ 

ఆగ్రహంతో నిరసనలకు దిగిన విద్యార్థులు 

హత్యకేసు దర్యాప్తు సీబీఐకి అప్పగింత 

అయిదు రోజులపాటు ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత 

ఇంఫాల్‌: జూలై నుంచి కనిపించకుండా పోయిన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురయ్యారని తెలియడంతో మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మృతులను హిజం లింథోయింగంబి(17), ఫిజమ్‌ హేమ్‌జిత్‌(20)గా గుర్తించారు. వారి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మంగళవారం ఉదయం విద్యార్థులు ఇంఫాల్‌లో భారీ ర్యాలీ జరిపారు. సీఎం కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.

అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతోపాటు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సంయమనం పాటించాలని, దర్యాప్తునకు సహకరించాలని ప్రజలను కోరింది. కిడ్నాప్, హత్యపై దర్యాప్తును సీబీఐకి అప్పగించామని తెలిపింది. విద్యార్థుల హంతకులను పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేసింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్నెట్‌ సేవలపై అయిదు రోజులపాటు నిషేదం విధిస్తున్నట్లు తెలిపింది.

అన్ని స్కూళ్లకు శుక్రవారం వరకు సెలవులు ప్రకటించింది. దాదాపు నాలుగు నెలల అనంతరం రాష్ట్రంలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను ఈ నెల 23న పునరుద్ధరించిన విషయం తెలిసిందే. మైతేయి వర్గానికి చెందిన హిజం లింథో ఇంగంబి(17) ఆమె స్నేహితుడు ఫిజమ్‌ హేమ్‌జిత్‌(20) కలిసి జూలై 6వ తేదీన చురాచంద్‌పూర్‌లోని పర్యాటక ప్రాంతం లండాన్‌కు వెళ్లారు. ఆ తర్వాత వారి జాడ తెలియలేదు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ అయ్యాయి. కుటుంబసభ్యులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజాగా వారి మృతదేహాల ఫొటోలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఒక ఫొటోలో ఇద్దరు విద్యార్థుల పక్కన సాయుధులు నిలబడి ఉండగా, మరో ఫొటోలో ఇద్దరి మృతదేహాలున్నాయి.  హంతకులను పట్టుకునేందుకు ఇప్పటికే పో లీసు బలగాలు వేట ప్రారంభించాయని సీఎం ఎన్‌.బిరేన్‌ సింగ్‌ తెలిపారు. హత్య ఘటనపై విచారణ చేపట్టేందుకు స్పెషల్‌ డైరెక్టర్‌ అజయ్‌ భటా్నగర్‌ నేతృత్వంలోని సీబీఐ బృందం ఇంఫాల్‌ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.  

లాఠీచార్జిలో 45 మందికి గాయాలు 
విద్యార్థుల కిడ్నాప్, హత్యను నిరసిస్తూ మంగళవారం విద్యార్థులు ఇంఫాల్‌లో భారీ ర్యాలీ చేపట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న పోలీసులు, భద్రతాబలగాలతో బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు.

ఈ ఘటనలో 45 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఎక్కువమంది బాలికలే ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా, ఇటువంటి అమానవీయ ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేటని కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో మైతేయి, కుకీల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 175 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.   

మరిన్ని వార్తలు