మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ తనయుడిపై హత్యాయత్నం

31 Oct, 2020 09:17 IST|Sakshi
ఎస్‌కే ఖాదార్‌బాషా (ఫైల్‌)  

విషమ పరిస్థితిలో విజయవాడ ఆసుపత్రికి తరలింపు 

ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు

సాక్షి, మచిలీపట్నం: మచిలీపట్నం మార్కెట్‌యార్డు చైర్మన్‌ అచ్చేభా తనయుడిపై హత్యాయత్నం జరిగింది. కట్టుకున్న భార్యే అతన్ని అంతమొదించేందుకు యత్నించింది. తన చెల్లెలిని రెండో వివాహం చేసుకోవటంతోపాటు తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడనే ఆవేదనతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన అతడ్ని హుటాహుటిన విజయవాడకు తరలించారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మచిలీపట్నం మార్కెట్‌యార్డు చైర్మన్‌ అచ్చేభాకు ఇద్దరు కుమారులు, మొదటి కుమారుడు కొంతకాలం కిందట గుండెపోటుతో మరణించాడు.

నగరంలో బంగారు దుకాణం నడుపుతున్న అచ్చేభా రెండో కుమారుడు ఎస్‌కే ఖాదర్‌బాషా నూరుద్దీన్‌పేటకు చెందిన నజియాను పదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప, ముగ్గురు మగ పిల్లలున్నారు. కొన్ని నెలలుగా నజియా (భార్య) సోదరితో ప్రేమ వ్యవహారం నడుపుతుండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని బంధువులు చెబుతున్నారు. పద్ధతి  మార్చుకోవాలని నజియా పలుమార్లు అభ్యర్థించినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. మూడు నెలల కిందట తన సోదరి మహిబాను తీసుకువెళ్లి రెండో వివాహం చేసుకుని ఆమెను పుట్టింటిలో దించాడు. అప్పటి నుంచి ఖాదర్‌ బాషా–నజియాల మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఖాదర్‌బాషా ఎక్కువగా తన సోదరి మహిబా వద్ద ఉండడం, తనను నిర్లక్ష్యం చేయడంతో నజియా తీవ్ర మనోవేదనకు గురయ్యేది.  (ప్రియుడి మోజులో.. సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ వైరుతో)

పథకం ప్రకారం.. 
గురువారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ఖాదర్‌తో సఖ్యంగా మాట్లాడింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఖాదర్‌బాషా నిద్రమత్తులో ఉండగా పథకం ప్రకారం అప్పటికే ఇంట్లో ఉంచిన పెట్రోల్‌ తెచ్చి మంచంపై ఉన్న ఖాదర్‌పై పోసింది. మరుక్షణం నిప్పంటించింది. ఒంటిపై మంటలు వ్యాపించటంతో ఒక్కసారిగా నిద్ర లేచిన ఖాదర్‌బాషా భయంతో కేకలు పెట్టాడు. అతని అరుపులకు నిద్రలేచిన స్థానికులు మంటలను ఆర్పారు. విషయాన్ని మార్కెట్‌యార్డు చైర్మన్‌ అచ్చేభాకు తెలియజేయడంతో హుటాహుటిన రాజుపేటకు వెళ్లి కాలిన గాయాలతో పడి ఉన్న కుమారుడు ఖాదర్‌బాషాను చికిత్స నిమిత్తం తొలుత బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  (మైనర్లకు ప్రేమ వివాహం.. అంతలోనే దారుణ హత్య)

దాదాపు 45 శాతం ఒంటిపై కాలిన గాయాలు కాగా ఎక్కువగా చాతిభాగంలో కాలిపోవడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం అతన్ని విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా హత్యాయత్నానికి పాల్పడిన ఖాదర్‌బాషా భార్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నజియాపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు ఇనగుదురుపేట సీఐ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ఖాదర్‌బాషాను వివిధ పార్టీల నాయకులు, నగర ప్రముఖులు  పరామర్శించి ధైర్యం చెప్పారు.

మరిన్ని వార్తలు