రోడ్‌ టెర్రర్: 11 మంది దుర్మరణం‌

29 Mar, 2021 05:23 IST|Sakshi

రెండు జిల్లాల్లో ఘోర ప్రమాదాలు.. 11 మంది దుర్మరణం

నెల్లూరు జిల్లాలో లారీని టెంపో ఢీకొని 8 మంది మృతి

కృష్ణాజిల్లాలో టిప్పర్‌ను ఆటో ఢీకొని ముగ్గురు కూలీలు..

సాక్షి, అమరావతి/విడవలూరు/గుడ్లవల్లేరు: రాష్ట్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు 11 మంది ప్రాణాలను బలిగొన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో 8 మంది, కృష్ణాజిల్లాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లాలో మరణించిన వారిలో ఏడుగురు తమిళనాడు వాసులు. ఈ ప్రమాదాల్లో మరో 16 మంది గాయాలపాలయ్యారు. నెల్లూరు జిల్లాలో ఆగి ఉన్న లారీని టెంపో ట్రావెలర్‌ ఢీకొనటంతో ఆధ్యాత్మిక యాత్రలో ఆలయాలు సందర్శించి వస్తున్న ఏడుగురు, టెంపో డ్రైవర్‌ మృతిచెందారు. కృష్ణాజిల్లాలో టిప్పర్‌ను ఓవర్‌టేక్‌ చేయబోయిన ఆటో డ్రైవర్‌ ఆ టిప్పర్‌ను ఢీకొనడంతో కూలి పనులకు వెళుతున్న ముగ్గురు మరణించారు. రెండు ప్రమాదాల్లోను డ్రైవర్ల నిద్రమత్తే కారణమని తెలిసింది. 

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు వద్ద నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున 2.20 గంటలకు ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులు నిద్రలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. తమిళనాడులోని పెరంబూరుకు సమీపంలోని అగరం గ్రామానికి చెందిన దామరమడుగు రేవతి (60) తీర్థయాత్రల టూర్లు నిర్వహిస్తున్నారు. ఆమె పుట్టిల్లు నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కోవెరపాళెం. ఆమె మరో 13 మందితో కలిసి తీర్థయాత్రల నిమిత్తం చెన్నై నుంచి రైల్లో ఈనెల 24న ఉదయం నెల్లూరు చేరుకున్నారు. నెల్లూరులో ఉన్న రేవతి కుమార్తె ప్రశాంతి అప్పటికే మాట్లాడి ఉంచిన టెంపో ట్రావెలర్‌లో ఆ 14 మంది ఆలయాల సందర్శనకు బయలుదేరారు.

వైఎస్సార్‌ జిల్లా, కర్నూలు జిల్లాల్లో పలు ఆలయాలు సందర్శించిన వారు శనివారం రాత్రి 9 గంటలకు శ్రీశైలం నుంచి నెల్లూరు బయలుదేరారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు వద్దకు వచ్చేసరికి.. 4 రోజులుగా విశ్రాంతి లేకుండా టెంపో నడుపుతున్న డ్రైవర్‌ నిద్రమత్తులో ఆగి ఉన్న గ్రానైట్‌ లోడ్‌ లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టెంపో డ్రైవర్‌ నల్లపరెడ్డి గురునా«థ్‌రెడ్డి (36), యాత్రికులు నందకుమార్‌ (67), అతడి భార్య పద్మిని (59), ఎం.జగదీశ్‌ (29), ఎస్‌.సుజాత (50), ఎస్‌.సద్గుణదేవి (35), వి.ఆశ (60) అక్కడికక్కడే మృతిచెందారు. చికిత్స నిమిత్తం తరలిస్తుండగా దామరమడుగు రేవతి (60) ప్రాణాలొదిలారు. తీవ్రంగా గాయపడిన రుక్మిణి, పుష్ప, విజయలక్ష్మి, అలివేణిలను నెల్లూరు ఆస్పత్రిలో చేర్చారు. తల్లీపిల్లలు భువనేశ్వరి, మాధవన్, నితీశ్‌ స్వల్పంగా గాయపడ్డారు. 

ముందుకు తీసుకొచ్చిన మృత్యువు
ఈ ప్రమాదంలో ఏసీ మెకానిక్‌ జగదీశ్‌ మృతిచెందగా అతడి భార్య భువనేశ్వరి, పిల్లలు మాధవన్, నితీశ్‌ ప్రాణాలతో బయటపడ్డారు. టెంపో వెనుక భాగాన కూర్చున్న తన భర్త జగదీశ్‌ సంగం వద్ద టెంపో ఆగినప్పుడు ముందు సీటులో కూర్చున్నారని, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని భువనేశ్వరి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ప్రమాదంలో భార్యతో సహా మృతిచెందిన నందకుమార్‌ రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగి. 10 కిలోమీటర్లు వెళితే నెల్లూరు చేరుకునేవారని, ఈలోపే ప్రమాదం కబళించిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.

కూలి పనులకు వెళుతుండగా..
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు శివారు రెడ్డిపాలెం వద్ద ఆదివారం వేకువజామున 3 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. 8 మంది కూలీలు, ఆటోడ్రైవర్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. పెడన మండలం జింజేరుపాలేనికి చెందిన 11 మంది కూలీలు ఆటోలో గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడులో కుప్పలు కొట్టే పనులకు బయలుదేరా>రు. రెడ్డిపాలెం వద్ద టిప్పర్‌ను ఓవర్‌టేక్‌ చేయబోయిన ఆటో డ్రైవర్‌ మట్టా వరప్రసాద్‌ నిద్రమత్తులో టిప్పర్‌ వెనుక భాగాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న జన్ను నాంచారయ్య (62), జన్ను వెంకన్న (60), మోతుకూరి శివ (58) అక్కడికక్కడే మృతి చెందారు.

టిప్పర్‌ కిందకు ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయిన ఆటోలో నుంచి మృతదేహాలను, గాయపడినవారిని అతికష్టం మీద బయటకు తీశారు. కూలీలు మోకా శ్రీనివాసరావు, మోకా గంగన్న, వీరమళ్ల పైడేశ్వరరావు, చిమటా గోవర్ధనరావు, చిమటా లక్ష్మీనారాయణ, మోకా వెంకటేశ్వరరావు, జన్ను నాగబాబు, మోతుకూరి బాలసుబ్రహ్మణ్యం, ఆటోడ్రైవర్‌ వరప్రసాద్‌లకు గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్‌ను, ఇద్దరు కూలీలను మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించినట్లు ఎస్‌.ఐ. సూర్యశ్రీనివాస్‌ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

గవర్నర్‌  విచారం
దామరమడుగు రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.  

మరిన్ని వార్తలు