ప్రమాదంలో ప్రమాదం : షాకింగ్‌ వీడియో

5 Dec, 2020 08:00 IST|Sakshi

డివైడర్‌ను ఢీకొట్టిన కారు..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

ఈ ప్రమాదాన్ని చూసేందుకు వచ్చిన వారిపైకి దూసుకెళ్లిన డీసీఎం

ఇద్దరి మృతి, సీఐ సహా  15 మందికి తీవ్ర గాయాలు

మెరుగైన వైద్యం కోసం మంత్రి హరీశ్‌ ఆదేశం

సాక్షి, సిద్దిపేట: ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా.. ఆ ప్రమాదాన్ని చూడటానికి వచ్చిన వారిపైకి డీసీఎం దూసుకురావడంతో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. సీఐ సహా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం సిద్దిపేట శివారులోని రాజీవ్‌ రహదారిపై చోటు చేసుకుంది.

పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ కథనం ప్రకారం.. హుజురాబాద్‌లో నివాసం ఉండే బయ్యారం నరేందర్‌రెడ్డి వైద్యసేవల కోసం తన తల్లిదండ్రులతో కలసి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. సిద్దిపేట శివారులోకి రాగానే కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న నరేందర్‌రెడ్డి (39), ఆయన తల్లిదండ్రులు రాజిరెడ్డి (70), విజయ (65) అక్కడికక్కడే మృతి చెందారు.

విషయం తెలుసుకున్న సిద్దిపేట టూటౌన్‌ సీఐ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలిస్తున్నారు. అలాగే.. చుట్టు పక్కల వారు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అంతలోనే కరీంనగర్‌ నుంచి వేగంగా వస్తున్న డీసీఎం (ఏపీ 03యూ2439) ఓ కారును ఓవర్‌టేక్‌ చేస్తూ.. ప్రమాదాన్ని పరిశీలిస్తున్న గుంపుపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన సిద్దిపేట జిల్లా రామునిపట్ల గ్రామానికి చెందిన అనరాశి మల్లేశం (40), మందపల్లి గ్రామానికి చెందిన వీరన్నపేట ఎల్లారెడ్డి (48)లను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్న సిద్దిపేట టూటౌన్‌ సీఐ పరశురామ్‌ గౌడ్, కానిస్టేబుల్‌ అశోక్‌తో పాటు మరో 13 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ ముందుగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించి    ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పలువురిని మెరుగైన చికిత్స కోసం సిద్దిపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రులు, హైదరాబాద్‌కు తరలించారు. గాయపడిన వారిలో గోపిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

హైదరాబాద్‌ ఎన్నికల కౌంటింగ్‌ బిజీలో ఉన్న మంత్రి హరీశ్‌రావు ప్రమాదం విషయం తెలుసుకొని మృతుల కుటుంబాలను ఫోన్‌లో ఓదార్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.  

మరిన్ని వార్తలు