పరీక్షలపై బెంగతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

25 Apr, 2022 07:34 IST|Sakshi

జియాగూడ: ఆరోగ్యం సరిగా లేక పరీక్షలు సరిగా రాయలేనేమోననే బెంగతో  పదో తరగతి విద్యార్థిని ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడ ఇక్బాల్‌గంజ్‌లో కమల, బాషా గౌడ్‌ దంపతులు నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు.  బాషా గౌడ్‌ ప్రైవేటు ఉద్యోగి. వీరి పెద్ద కూతురు వివాహం జరిగింది. రెండో కూతురు ప్రియాశక్తి  21 డిగ్రీ మొద టి సంవత్సరం చదువుతోంది. 15 ఏళ్ల చిన్నకూతురు జియాగూడ శ్రీనివాస హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది. 15 రోజులుగా ఆమె ఆరోగ్యం సరిగా ఉండడం లేదు.

10వ తరగతి పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. ఈ క్రమంలో సరిగా చదవలేకపోతున్నానని మానసిక ఆందోళనకు గురైంది. శనివారం సాయంత్రం తల్లితో బాగానే ఉంది. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంట్లోని పూజగదిలోని థమ్‌సప్‌ బాటిల్‌లో ఉన్న కిరోసిన్‌ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా మంటలు చెలరేగడంతో వేరే గదిలో ఉన్న తల్లి కమల, అక్క ప్రియాశక్తి వెంటనే వచ్చి రగ్గులతో మంటలు ఆర్పివేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డ్యూటీలో ఉన్న ఎస్‌.ఐ.మురళీ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలు 67 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

(చదవండి: పిల్లలను తుపాకితో బెదిరిస్తున్న దుండగుడి వీడియోలు వైరల్‌)

మరిన్ని వార్తలు