2014లో చోరీ.. ఎనిమిదేళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్‌ 

12 Dec, 2021 11:27 IST|Sakshi

రూ.20 లక్షల విలువైన నగలు స్వాదీనం 

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌) : 2014లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఎనిమిదేళ్ల తర్వాత ఛేదించి నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. క్రైమ్‌ బ్రాంచ్‌ సీఐ బాజీజాన్‌సైదా, వేదాయపాళెం సీఐ నరసింహరావు మాట్లాడుతూ, 2014 మే 9వ తేదీన నెల్లూరు నగరంలోని వెంకటరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న తలపనేని చిన్నవెంకటేశ్వర్లు ఇంట్లో 165 సవర్ల బంగారు నగలు చోరీ జరిగిందన్నారు. ఈ మేరకు అప్పట్లో కేసు నమోదు చేసి, నేరస్తుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

పాతకేసుల పరిష్కారంలో భాగంగా జిల్లా ఎస్పీ విజయారావు ఆదేశాల మేరకు సీసీఎస్‌ డీఎస్పీ శివాజీరాజు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేశామన్నారు. ఈ కేసులో పశ్చిమగోదావరి జిల్లా కొండగూడెం గ్రామానికి చెందిన మానికొండ అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి వేరే కేసులో శిక్ష అనుభవిస్తుండగా కోర్టు అనుమతితో అదుపులో తీసుకుని విచారించగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకోవటం జరిగిందన్నారు.

హైదరాబాద్‌ అమీర్‌పేటలోని బంగారు దుకాణంలో కుదువ పెట్టిన 55 సవర్ల బంగారు నగలను స్వాదీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ.20 లక్షలు ఉంటుందని వివరించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరచిన క్రైమ్‌ బ్రాంచ్‌ సిబ్బంది ఏఎస్సై గిరిధర్‌రావు, హెడ్‌ కానిస్టేబుల్స్‌ సురే‹Ùబాబు, వెంకటేశ్వర్లు, రమే‹Ù, సీసీఎస్‌ కానిస్టేబుల్స్‌ సతీష్, హరీశ్‌రెడ్డి, సాయిఆనంద్, హెడ్‌కానిస్టేబుల్‌ సుధాకర్‌ ఆనంద్, సాయికిశోర్, మస్తాన్‌లను అభినందించారు.
 

మరిన్ని వార్తలు