ఉదయపు దొంగ అరెస్టు

8 Apr, 2021 10:31 IST|Sakshi

ముందుగా రెక్కీలు.. పొద్దున్నే చోరీలు

గంగవరం ఐడీపార్టీకి చిక్కిన వైనం

ఆంధ్రా, తమినాడులో 15కుపైగా కేసులు 

పలమనేరు(చిత్తూరు జిల్లా): రాత్రిపూట దొంగతనాలు చేసే దొంగల గురించి విని ఉంటాం. కానీ ఈ దొంగ మాత్రం కేవలం ఉదయం మాత్రమే అది కూడా గ్రామాల్లోనే దొంగతనాలు చేస్తుంటాడు. గత ఏడేళ్లుగా ఆంధ్రా, తమిళనాడు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఈ ఉదయపు దొంగను గంగవరం ఐడీ పార్టీ బుధవారం అరెస్టు చేసింది. తమిళనాడు రాష్ట్రం తిరప్పత్తూరు జిల్లా కరంభూరు గ్రామానికి చెందిన గోవిందరాజన్‌ కుమారుడు శక్తివేల్‌(33) అక్కడ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా చోరీలు చేయడం ఇతని ప్రవృత్తి. జనసంచారం తక్కువగా ఉండే గ్రామాలను ఎంచుకుంటాడు.

ఉదయం పూట ఇళ్లకు తాళాలు వేసి పొలం పనులకు వెళ్లే వారి ఇళ్లను గుర్తిస్తాడు. తరువాత బైక్‌ లేదా కారుపై వచ్చి ఆ ఇంటి తలుపుపై లేదా చుట్టుపక్కల తాళాన్ని వెతికి సులభంగా ఇంట్లోకి వెళ్లి బంగారు నగలను చోరీ చేయడం ఇతని ప్రత్యేకత. ఇలా ఇప్పటిదాకా గత ఏడేళ్లలో పలు చోరీలకు పాల్పడ్డాడు. కానీ ఇరు రాష్ట్రాల్లో పోలీసు స్టేషన్‌కు చేరిన కేసులు మాత్రం 15 వరకు ఉంటాయి. పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు ఈ దొంగ 250 గ్రాముల బంగారాన్ని చోరీ చేశాడు. ఈ ప్రాంతంలో ఉదయం పూట మాత్రమే జరుగుతున్న చోరీలపై స్థానిక ఐడీ పార్టీ ఆరునెలలుగా నిఘా పెట్టింది. తమిళనాడు రాష్ట్రంలోనూ ఇలాగే చోరీలు సాగుతున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో లోతైన విచారణ ద్వారా ఈ చోరీలకు పాల్పడుతున్నది శక్తివేల్‌గా గుర్తించారు. ఎట్టకేలకు బైరెడ్డిపల్లి వద్ద నిందితున్ని బుధవారం అరెస్టు చేశారు.
చదవండి:
ఏపీకి కోటి డోసుల కోవిడ్‌ వ్యాక్సిన్‌!  
నాడు అవమానం.. నేడు అందలం 

మరిన్ని వార్తలు