చోరీకోసం వచ్చి ప్రాణాలు కోల్పోయాడు 

13 Apr, 2021 14:30 IST|Sakshi

భయంతో భవనంపై నుంచి దూకాడు

ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతి 

బంజారాహిల్స్‌: దొంగతనం చేయడానికి వచ్చి ఇంటి కుటుంబ సభ్యులు కేకలు పెట్టడంతో పారిపోయే క్రమంలో  ఓ దొంగ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకడంతో మృతి చెందాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపి న మేరకు.. బోరబండ సఫ్దర్‌నగర్‌లో నివాసం ఉండే సయ్యద్‌ చాంద్‌పాషా అలియాస్‌ ఇబ్రహీం (22) ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్‌రోడ్‌ నెం 10(బి) లోని  వెంకటగిరిలోని  ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీ కోసం వచ్చాడు. భవనంలోని నాలుగో అంతస్తులో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అలికిడి రావడంతోఇంటి యజమానులు కేకలు వేశారు.

దాంతో కంగారు పడిన ఇబ్రహీం పారిపోయే క్రమంలో నాలుగో అంతస్తునుంచి పక్కనున్న ఖోమాన్‌  స్కూల్‌భవనం మీదకు దూకేశాడు.  అక్కడినుంచి రోడ్డు మీదకు దూకడంతో తలపగలడంతో పాటు  కాళ్లు విరిగిపోయాయి. స్థానికులు జూబ్లీహిల్స్‌పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఇబ్రహీంను 108లో ఉస్మానియా ఆస్పత్రికి తర లించారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి గురించి పోలీసులు ఆరా తీయగా అతడిపై సనత్‌నగర్‌ పీఎస్‌లో ఒక రాబరీ కేసు, ఒక చోరీ కేసులో నిందితుడిగా ఉన్నట్లు తేలింది.  

చదవండి: మరొకరితో చనువుగా ఉంటోందని బీటెక్‌ విద్యార్థినిపై దారుణం

మరిన్ని వార్తలు