బిర్యానీతో కలిపి నగలు మింగేశాడు.

7 May, 2022 04:24 IST|Sakshi

పిలిస్తే పార్టీకొచ్చాడు. మంచిగా బిర్యానీ తిన్నాడు. పనిలోపనిగా ఇంట్లోని లక్షన్నర విలువైన నగలను కూడా లాగించేశాడు. కొట్టేద్దామనుకున్నాడో ఏమో గానీ అడ్డంగా దొరికిపోయాడు. తమిళనాడులోని చెన్నైలో ఉన్న సలిగ్రామంలో ఇటీవల ఈ ఆశ్చర్యకర ఘటన జరిగింది. నగల షాపులో పని చేసే ఓ మహిళ తన మేనేజర్, ఆమె పార్ట్‌నర్‌ (32)ను ఇటీవల ఈద్‌ పార్టీకి ఆహ్వానించారు. పార్టీ అయిపోయాక అందరూ వెళ్లిపోయారు.  

ఆ తర్వాత తన ఇంట్లోని డైమండ్‌ నెక్లెస్, ఓ పెండెంట్, బంగారు చైన్‌ పోయిందని ఆమె గుర్తించారు. మేనేజర్, ఆమె పార్ట్‌నర్‌కు ఫోన్‌ చేసి నగల గురించి ఆరా తీయగా తాము చూడలేదని వాళ్లు చెప్పారు. దీంతో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. పార్టీ సమయంలో మేనేజర్‌ పార్ట్‌నర్‌ ఆ నగలున్న గదిలోకి వెళ్లి గడియ వేసుకొని 10 నిమిషాల తర్వాత వచ్చారన్నారు.

మేనేజర్‌ పార్ట్‌నర్‌ను పిలిచి పోలీసులు ఆరా తీయగా నగలను మింగేశానని చెప్పాడు. పోలీసు అతన్ని దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లి స్కాన్‌ చేయించగా కడుపులో నగలున్నట్టు తెలిసింది. అరటిపండు తినిపించి వాటిని బయటకు తీయించి సదరు మహిళకు అప్పగించారు. తాగిన మైకంలో బిర్యానీతో పాటు నగలను కూడా మింగేశానని అతగాడు చెప్పుకొచ్చాడు. 
– సాక్షి,సెంట్రల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు