వరుస చోరీలు.. జనం బెంబేలు

23 May, 2022 23:33 IST|Sakshi
సీసీ కెమెరాలో రికార్డయిన మెడికల్‌ షాపులో చోరీ యత్నం 

లక్కిరెడ్డిపల్లె : లక్కిరెడ్డిపల్లెలో గత ఆరు నెలల నుంచి వరుస చోరీలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం అర్థరాత్రి 1 గంట సమయంలో రాజ్‌ మెడికల్‌ షాపులో రూ.3వేలు, సెల్‌పాయింట్‌లో ఫోన్లకు సంబంధించిన సామగ్రి దొంగిలించినట్లు బాధితులు ఫరీద్‌ బాబా, కరీం ఆదివారం తెలిపారు. రాజ్‌ మెడికల్‌ షాప్‌లో సీసీ కెమెరాలు అమర్చినా దొంగలు తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లి తమ వద్ద ఉన్న సెల్‌ లైటింగ్‌తో డబ్బులు తీసుకొని బయటికి వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

ఈ మేరకు బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఇలా ఉండగా గత ఏడాది నవంబర్‌లో దర్బార్‌బాషా మెడికల్‌ షాపులో రూ.1.73లక్షలు నగదు దొంగలు అపహరించుకుపోయారు. తరువాత రెండోసారి జనవరిలో రూ.16వేలు అపహరించారని దర్బార్‌ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనల్లో ఇంతవరకు దొంగల ఆచూకీ లేదు.

ఇంతలోనే శనివారం అర్థరాత్రి మరో మారు దొంగలు లక్కిరెడ్డిపల్లె–రామాపురం రోడ్డులో ఉన్న మెడికల్‌ షాపు, సెల్‌పాయింట్‌లో చోరీకి పాల్పడటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పోలీసులు దొంగతనం కేసులను ఛేదించాలని ప్రజలు కోరుతున్నారు.

మంగంపేట పునరావాసకాలనీలో..
ఓబులవారిపల్లె : మంగంపేట పునరావాస కాలనీలో శనివారం రాత్రి గౌనూతల శ్రీనవాసులు ఇంట్లో చోరీ జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తన కుమార్తె అనారోగ్యం కారణంగా శనివారం బాధితుడు కడపకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంటి తాళాలు పగులకొట్టి బంగారు నగలు, వెండి దొంగిలించారు.

ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఇంటిలోనే వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. శ్రీనివాసులు, ఆయన భార్య సుబ్బరత్నలు పరిశీలించగా రూ. 45 వేలు నగదు, విలువైన బంగారం చోరి అయినట్లు గుర్తించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

మరిన్ని వార్తలు