ఢిల్లీలోని జ్యువెలరీ షోరూంలో భారీ చోరీ.. రూ.25 కోట్ల నగలు మాయం 

26 Sep, 2023 15:24 IST|Sakshi

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీ జంగ్‌పురలోని ఉమ్రావ్ జ్యువెలరీ షాపులో భారీ స్థాయిలో చోరీ జరిగింది. దొంగలు నాల్గవ అంతస్తులో టెర్రస్‌పై నుండి లోపలికి చొరబడిన దొంగలు నేరుగా లాకర్ రూముకు పెద్ద కన్నం వేసి సుమారు రూ.25 కోట్లు విలువ చేసే నగలను ఎత్తుకెళ్లారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దొంగలు మొదట పకడ్బందీగా రెక్కీ నిర్వహించారని చాలా తెలివిగా సీసీ కెమెరాలు పనిచేయకుండా ఆపేసి చోరీకి పాల్పడ్డారని అన్నారు. సోమవారం నగల షోరూంకు సెలవని తెలుసుకుని అదేరోజు దొంగతనానికి పాల్పడ్డారన్నారు. దొంగలు నాలుగో అంతస్తు టెర్రస్‌పై నుండి లోపలికి చొరబడి మొదట సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి అక్కడి నుండి గ్రౌండ్ ఫ్లోర్‌లోని స్ట్రాంగ్ రూముకి చేరుకొని లాకర్‌కు పెద్ద రంధ్రం చేసి సుమారు రూ.20-25 కోట్లు విలువ చేసే నగలను దోచుకెళ్లారు. వీటితోపాటు డిస్‌ప్లేలో ఉంచిన నగలను కూడా ఎత్తుకెళ్లిపోయారని తెలిపారు. 

ఆదివారం రాత్రి షోరూంకు తాళాలు వేసి వెళ్ళిపోయిన యజమాని మంగళవారం షోరూం తెరిచి చూసే సరికి దొంగతనాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. సీసీటీవీ కేబుల్ కట్ చేయక ముందు ఫుటేజీలో రికార్డయినంత వరకు పరిశీలిస్తూ దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిపారు పోలీసులు. సోమవారం హర్యానాలో కూడా ఇదే తరహాలో ఒక దొంగతనం జరిగింది. కోఆపరేటివ్ బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు గ్యాస్ కట్టర్‌తో గోడకి కన్నం చేసి మొత్తం నగదును, నగలను దోచుకెళ్లారు. రెండు దొంగతనాలు ఒకే తీరుగా జరగడంతో దొంగతనం చేసింది ఒక్కరేనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. 

ఇది కూడా చదవండి: సుప్రీంలో కల్వకుంట్ల కవితకు ఊరట

మరిన్ని వార్తలు