పోలీసు అధికారులుండే అపార్ట్‌మెంట్‌లోనే భారీ చోరీ 

29 Sep, 2021 01:56 IST|Sakshi
చోరీ చేసి చిందరవందరగా పడేసిన సామగ్రి  

హనుమకొండ జిల్లా కాజీపేటలో ఘటన 

190 తులాల బంగారం మాయం

కాజీపేట: ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు నివాసముండే అపార్ట్‌మెంట్‌లోనే దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ధనవంతులు, వ్యాపారులు, ఉద్యోగులుండే ప్రాంతం కావడంతో చుట్టూ సీసీ కెమెరాలున్నా దొంగలు దర్జాగా లోపలికి చొరబడి బంగారు నగలను మాత్రమే చోరీ చేసి వెండి నగలతోపాటు నగదును చిందరవందరగా పడేసి వెళ్లారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట 61వ డివిజన్‌ వడ్డెపల్లి ట్యాంక్‌బండ్‌ ప్రాంతంలోని పీజీఆర్‌ అపార్ట్‌మెంట్‌లో జరిగింది.

మూడు ఫ్లాట్లలో దాదాపు 190 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. స్థానిక సీఐ గట్ల మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం... పీజీఆర్‌ అపార్ట్‌మెంట్‌లో 60 కుటుంబాలు ఉంటున్నాయి. 202 ఫ్లాట్‌లో ఉండే ‘నిట్‌’రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఆర్వీ చలం, 203లో ఉండే వెలిచర్ల కుమార్, 102 ఫ్లాట్‌ వాస్తవ్యుడు మనీశ్‌కుమార్‌ ఇళ్లకు తాళాలు వేసి బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లారు. ఇదే అదనుగా ఆదివారంరాత్రి దొంగలు వడ్డెపల్లి రిజర్వాయర్‌ ట్యాంక్‌బండ్‌ పైభాగం నుంచి ఫెన్సింగ్‌ కట్‌ చేసి లోపలికి దిగి వాచ్‌మెన్‌ గంగారపు కొమురయ్య ఇంటికి బయటి నుంచి గొళ్లెం పెట్టి అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డారు.

మూడు ఫ్లాట్లకున్న తాళాలను పగులగొట్టి బీరువాల్లోని దాదాపు 190 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. సోమవారంరాత్రి తమ ఇళ్లలో దొంగతనం జరిగినట్లుగా సమాచారం అందుకున్న చలం ఇంటికి వచ్చి చూడగా పక్క ఫ్లాట్లలోనూ చోరీలు జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని డీసీపీ పుష్ప తెలిపారు.  

మరిన్ని వార్తలు