‘విస్ట్రాన్‌’లో వేలాది ఐఫోన్లు లూటీ

15 Dec, 2020 05:17 IST|Sakshi

ఉద్యోగుల హింసాకాండ వల్ల రూ.437.70 కోట్ల నష్టం  

149 మంది అరెస్టు  

బెంగళూరు:  కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా నరసాపురాలోని ఐఫోన్లు, ఎలక్ట్రానిక్‌ విడిభాగాల తయారీ సంస్థ విస్ట్రాన్‌ కార్పొరేషన్‌లో అత్యంత విలువైన వేలాది ఐఫోన్లు లూటీకి గురయ్యాయి. ఉద్యోగుల హింసాకాండ వల్ల విలువైన అత్యాధునిక యంత్రాలు, పరికరాలు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం రూ.437.70 కోట్ల నష్టం వాటిల్లినట్లు విస్ట్రాన్‌ ప్రతినిధులు సోమవారం ప్రకటించారు. నాలుగు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ విస్ట్రాన్‌ ప్లాంట్‌లో ఉద్యోగులు శనివారం తీవ్ర బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ప్లాంట్‌ చాలావరకు ధ్వంసమైంది. విలువైన యంత్రాలు, పరికరాలు, కంప్యూటర్లు అగ్నికి ఆçహుతయ్యాయి. 5,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 2,000 మంది గుర్తు తెలియని వ్యక్తులు హింసాకాండకు పాల్పడ్డారని విస్ట్రాన్‌ ప్రతినిధి టీడీ ప్రశాంత్‌ చెప్పారు. ఈ మేరకు ఆయన పోలీసులకు, కర్ణాటక కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు. తమ సంస్థకు రూ.437.70 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. పోలీసులు ఇప్పటివరకు 149 మంది నిందితులను అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. విస్ట్రా కంపెనీలో దౌర్జన్యానికి పాల్పడ్డ వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.  

మరిన్ని వార్తలు