‘రోజూ నరకం చూపేవాడు.. కసితీరా పొడిచి చంపేశా’

21 May, 2021 17:00 IST|Sakshi

తల్లి వివాహేతర సంబంధం.. హంతకుడిగా మారిన మైనర్‌ కుర్రాడు

గుజరాత్‌లో చోటు చేసుకున్న సంఘటన

గాంధీనగర్‌: నిండా పదిహేనేళ్లు కూడా లేవు.. లోకం పోకడ గురించి తెలియదు. చదువుకుంటూ.. స్నేహితులతో కలిసి.. సంతోషంగా గడపాల్సిన ఆ కుర్రాడు హంతకుడిగా మారాడు. క్షణికావేశంలో తల్లి చేసిన తప్పు ఆ కుర్రాడి జీవితాన్ని గందరగోళం చేసింది. ఆ వివరాలు.. గుజరాత్‌ అహ్మదాబాద్‌కు చెందిన నిందితుడి తల్లి.. చాలా ఏళ్ల క్రితమే ప్రియుడితో కలిసి పారిపోయింది. కొద్ది రోజులు తర్వాత ప్రియుడి నిజ స్వరూపం బయటపడింది. చీటికి మాటికి ఆమెతో గొడవపడుతూ.. చికతబాదేవాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆమె మైనర్‌ కుర్రాడిని కూడా కొట్టేవాడు. ప్రతి రోజు చిత్ర హింసలకు గురి చేసేవాడు. 

ఈ బాధ భరించలేకపోయిన నిందితుడు.. తల్లి ప్రియుడ్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మే 17న అతడిని తీసుకుని బైక్‌ మీద నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. ఆ తర్వాత కత్తితో అతడిపై దాడి చేశాడు. ఆ తర్వాత అతడు మరణించేవరకు కత్తితో పొడుస్తూనే ఉన్నాడు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేశారు. 

ఇక దర్యాప్తులో మైనర్‌ బాలుడి పేరు వెలుగులోకి రావడంతో.. కుర్రాడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో నిందితుడు.. చనిపోయిన వ్యక్తి ప్రతి రోజు తనను, తల్లిని చిత్ర హింసలకు గురి చేసేవాడని.. నరకం చూపేవాడని.. అందుకే అతడిని హత్య చేశానని అంగీకరించాడు. 

చదవండి: అతని వల్లే నా భర్త వదిలేశాడు.. ప్రియుడు పెళ్లి చేసుకోవాలి

మరిన్ని వార్తలు