కారులో ముగ్గురు సజీవ దహనం

18 May, 2022 04:18 IST|Sakshi

మార్కాపురం/భాకరాపేట: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ముగ్గురు యువకులు సజీవదహనం అయ్యారు. టైరు పేలి అదుపు తప్పిన కారు.. కంటైనర్‌ లారీని ఢీకొనడంతో స్నేహితులు సాకిరి బాలాజీ (21), పటాన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ (21), రావూరి తేజ (29) నిలువునా కాలిపోయారు.

తేజ పాస్‌పోర్ట్‌ పనిమీద ముగ్గురు విజయవాడ వెళ్లారని, తిరుగు ప్రయాణంలో ఈ   ఘోరం జరిగిందని భావిస్తున్నారు. కంభం వైపు నుంచి మార్కాపురం వైపు వస్తున్న ఏపీ39 డీఈ 6450 నంబరు కారు తిప్పాయపాలెం–జంగంగుంట్ల మధ్య మిట్టమీదిపల్లి అడ్డరోడ్డు వద్దకు రాగానే టైరు పేలిపోయింది. దీంతో కుడివైపు మార్కాపురం నుంచి కంభం వైపు వెళుతున్న కేఏ14 సీ 2949 నంబరు కంటైనర్‌ లారీని ఢీకొంది. కారులో ఉన్న పెట్రోల్‌ ట్యాంక్‌కు మంటలు అంటుకోవడంతో అందులోని ముగ్గురు సజీవ దహనమయ్యారు.

మంటలు ఎగిసిపడుతుండటంతో కారు వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. డీఎస్పీ డాక్టర్‌ కిశోర్‌కుమార్, సీఐ ఆంజనేయరెడ్డి సమాచారం ఇవ్వడంతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కారు నంబరు ఆధారంగా యజమాని చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం మోటుమల్లెలపాలెం పోస్టు, ఆదినారాయణవారిపల్లికి చెందిన ఈటెలమర్రి నరేంద్రగా గుర్తించి పోలీసులు అతడికి సమాచారమిచ్చారు. తాను కారును బాడుగకు ఇచ్చానని నరేంద్ర పోలీసులకు తెలిపారు. దీంతో డ్రైవర్‌ రావూరు తేజ అయి ఉండవచ్చని అనుమానించిన పోలీసులు వివరాలు సేకరించారు.

మూడు కుటుంబాల్లో విషాదం
భాకరాపేటకు చెందిన సాకిరి బాలాజీ, పటాన్‌ ఇమ్రాన్‌ఖాన్, రావూరి తేజ స్నేహితులు. వీరు ముగ్గురు ఎక్కడికెళ్లారో తమకు తెలియదని తల్లిదండ్రులు చెబుతున్నారు. స్నేహితులు మాత్రం త్వరలో గల్ఫ్‌కు వెళ్లాలనుకుంటున్న రావూరి తేజ పాస్‌పోర్ట్‌ పనిమీద విజయవాడ వెళ్లారని చెబుతున్నారు. బాలాజీ తండ్రి సత్యనారాయణ, తల్లి ఇంద్ర టీటీడీలో పనిచేసి రిటైరయ్యారు.

వీరికి ఇద్దరు కుమారులు కాగా.. మృతుడు పెద్ద కుమారుడు. పటాన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ తండ్రి మస్తాన్‌ పంక్చర్‌ షాపు నిర్వహిస్తున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం కాగా.. ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. రావూరి తేజ తండ్రి భాస్కర్‌ పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయన ఒక్కగానొక్క కుమారుడు తేజ తండ్రికి సాయంగా ఉండేందుకు గల్ఫ్‌ వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతలోనే జరిగిన ఈ ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. 

మరిన్ని వార్తలు