అప్పు చేసి.. అక్రమ మద్యం తెచ్చి!

2 Apr, 2021 11:38 IST|Sakshi
ముగ్గురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు, చిత్రంలో.. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు

అనంతపురం క్రైం: అక్రమ మద్యం ద్వారా డబ్బులు సంపాదించాలనుకున్న ముగ్గురు స్నేహితులు కటకటాలపాలయ్యారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తీసుకొస్తున్న వీరిని అనంతపురం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 152 బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడుకు చెందిన గణపతి సుధాకర్, పెదపప్పూరు మండలం సింగనగుట్టపల్లికి చెందిన పుష్పాక త్యాగరాజు, శింగనమల మండలం ఉల్లికల్లుకు చెందిన తలారి కల్యాణ్‌ కుమార్‌ అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ చదివారు.

ఈ క్రమంలో ముగ్గురూ స్నేహితులయ్యారు. డిగ్రీ పూర్తయ్యాక వివిధ పనులు చేశారు. కానీ డబ్బు అరకొరగానే వస్తుండటంతో.. అసంతృప్తికి గురైన వీరు సులభంగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఇందుకు అక్రమ మద్యం విక్రయాలను ఎంచుకున్నారు. అయితే చేతిలో డబ్బులు లేకపోవడంతో ప్రైవేటు ఫైనాన్స్‌లో లోన్‌ తీసుకున్నారు. తెలంగాణ నుంచి మద్యం తీసుకువచ్చి విక్రయించేందుకు అనంతపురం తపోవనంలో ఓ గదిని కూడా అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలోనే రెండు కార్లలో తెలంగాణకు వెళ్లి 152 బాటిళ్ల మద్యం కొనుగోలు చేశారు. బోర్డర్లన్నీ దాటించి గురువారం ఉదయం అనంతపురం చేరుకున్నారు. అయితే వీరిపై అప్పటికే కన్నేసిన అనంతపురం నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది.. తపోవనంలో ఈ రెండు కార్లను తనిఖీ చేసి 152 మాన్షన్‌హౌస్‌ ఫుల్‌ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కార్లలో ప్రయాణిస్తున్న స్నేహితులు ముగ్గుర్నీ అరెస్టు చేశారు.
చదవండి:
అమానుషం: ఒకే ఆటోలో వచ్చారని..  
ముంచంగిపుట్టు కేసులో ఆరుగురు అరెస్ట్‌ 

 

మరిన్ని వార్తలు