ఫ్రాన్స్‌ చర్చిలో కత్తితో దాడి

30 Oct, 2020 04:54 IST|Sakshi
ఘటనాస్థలిలో పోలీస్‌ పహారా

తెగిపడిన మహిళ తల..మరో ఇద్దరి మృతి

పారిస్‌: ఫ్రాన్స్‌లో మరో ఘోరం జరిగింది. చర్చిలో ఓ దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఓ మహిళ తల తెగిపడింది. మరో ఇద్దరు మరణించారు. నైస్‌ సిటీలోని నాట్రిడేమ్‌ చర్చిలో గురువారం ఈ దారుణం చోటుచేసుకుంది. అతడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. కిరాతకుడి వివరాలను అధికారులు ఇంకా బయటపెట్టలేదు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఉగ్రవాద చర్యేనని భావిస్తున్నారు. పోలీసులతో జరిగిన పెనుగులాటలో అతను గాయపడ్డాడని నైస్‌ నగర మేయర్‌ క్రిస్టియన్‌ ఎస్ట్రోసీ చెప్పారు. చర్చిలో జరిగిన దాడిలో ముగ్గురు చనిపోవడం పట్ల ఫ్రాన్స్‌ ప్రధానమంత్రి జీన్‌ కాస్టెక్స్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తమ దేశానికి ముప్పు గరిష్ట స్థాయికి చేరినట్లు భావిస్తున్నామని అన్నారు.మరోవైపు, అవిగ్నొన్‌ నగరం సమీపంలోని మాంట్‌ఫెవిట్‌లో ఓ వ్యక్తి తుపాకీ చూపిస్తూ స్థానికులకు బెదిరింపులకు గురిచేశాడు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ ఖాతరు చేయలేదు. పోలీసులు అతడిని కాల్చివేసినట్లు స్థానిక రేడియో వెల్లడించింది.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు