బీభత్సం సృష్టించిన కారు.. ముగ్గురి ప్రాణాలు గాల్లో​కి

12 Sep, 2021 07:42 IST|Sakshi

బీభత్సం సృష్టించిన కారు 

డివైడర్‌ను ఢీకొట్టి..రోడ్డు అవతల వెళ్తున్న బైకు, ఆటోను ఢీకొన్న వైనం.. 

బైకుపై వెళ్తున్న యువకుడు, ఆటోలో ప్రయాణిస్తున్నతల్లీకొడుకుల దుర్మరణం మరో నలుగురికి గాయాలు 

మేడ్చల్‌ శివారు రేకులబావి వద్ద 44వ జాతీయ రహదారిపై ఘటన 

కారు డ్రైవర్‌ అతివేగం..నిర్లక్ష్యం వల్లే ప్రమాదం 

మేడ్చల్‌(హైదరాబాద్‌): పనులు ముగించుకుని ఇంటికి బైకుపై బయలుదేరిన ఓ యువకుడు..మూడేళ్ల కుమారునితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి ఆటోలో తిరుగుపయనమైన ఓ మహిళ అకస్మాత్తుగా మృత్యుఒడికి చేరుకున్నారు. ఓ కారు డ్రైవర్‌ అతివేగం..నిర్లక్ష్యం కారణంగా...వారి ప్రమేయం లేకుండానే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి బంధువులకు దు:ఖాన్ని మిగిల్చారు.

ఈ విషాదకర సంఘటన శనివారం సాయంత్రం మేడ్చల్‌ శివారులోని రేకులబావి వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు..సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొల్తూర్‌ గ్రామానికి చెందిన సుధీర్‌ వర్మ (25) మేడ్చల్‌లో పనులు ముగించుకుని బైక్‌పై ఇంటికి తిరుగుపయనమయ్యాడు. అలాగే మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధి బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన లావణ్య (30), కుమారుడు కౌశిక్‌ (3)తో కలిసి శామీర్‌పేట్‌ మండలం జగన్‌గూడ గ్రామంలోని తమ బంధువుల ఇంటి వెళ్లి ప్యాసింజర్‌ ఆటోలో ఇంటికి తిరిగి వెళ్తోంది.

ఈ క్రమంలో వీరి వాహనాలు రేకుల బావి వద్దకు రాగానే..రోడ్డుకు ఆవలివైపు తూప్రాన్‌ వైపు వెళ్తున్న ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి.. వేగంగా ఇవతలికి ఎగిరి పడి ముందు బైకును..ఆ తర్వాత ప్యాసింజర్‌ ఆటోను ఢీకొట్టింది. దీంతో సుధీర్‌వర్మ, లావణ్యలు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా..కౌశిక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురు గాయపడ్డారు.

కారు డ్రైవర్‌ అతివేగం..నిర్లక్ష్యం కారణంగా ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. కాగా ఘటన జరిగిన వెంటనే కారులో ఉన్న ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. కారులో డ్రైవర్‌తో పాటు మరో మహిళ ఉన్నారని, వారికి కూడా గాయాలైనట్లు సమాచారం అందిందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని మేడ్చల్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. 

ఒక్కరి నిర్లక్ష్యం.. మూడు నిండు ప్రాణాలు 
కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం అమాయకులైన ముగ్గురి ప్రాణాలు తీసిందని స్థానికులు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై వాహనాలు అడ్డూ అదుపూ లేని వేగంతో వెళ్తున్నాయని, దీంతో ఎంతో మంది స్థానికులు ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.  

చదవండి: ఒంటరి ప్రయాణికులనే సెలక్ట్‌ చేసుకుని.. ఆపై..

మరిన్ని వార్తలు