కరోనా భయమే వారి ప్రాణం తీసిందా?

15 Aug, 2020 12:47 IST|Sakshi
సూరి, వంశీ (ఫైల్‌)

దాచేపల్లి మండలంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు...చిలుకూరులో ఒకరు

దామరచర్ల (మిర్యాలగూడ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. దామరచర్ల మండలం వాడపల్లికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానిక కృష్ణానది వంతెన అవతలి భాగం దాచేపల్లి మండలం పొందుగుల సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అన్నదమ్ములు కొమెర సూరి (21), వంశీ (17) ద్విచక్రవాహనంపై ఏపీలోని అమ్మమ్మ ఇంటి నుంచి వాడపల్లికి వస్తుండగా సరిహద్దులో లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో సూరి కోదాడలో చదువుతుండగా, తమ్ముడు వంశీ స్థానికంగా 10వ తరగతి విద్యనభ్యసిస్తున్నాడు. ప్రస్తుతం పాఠశాలలు లేకపోవడంతో ఇంటివద్దే ఉంటున్నారు. కాగా వీరి తండ్రి పిచ్చయ్య ఈ ఏడాది జనవరిలో మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ఏడు నెలల కాలంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. 

కరోనా భయమే వారి ప్రాణం తీసిందా? 
ఇటీవల గ్రామంలో కరోనా ఉధృతి పెరిగింది. దీంతో మృతుల తల్లి గురమ్మ తమ ఇద్దరి కుమారులను తీసుకొని తన తల్లిగారి గ్రామమైన ఏపీలోని గుంటూరు జిల్లా గురజాల మండలం పులిపాడ్‌లో తాత్కాలికంగా ఉంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం తమ అమ్మమ్మ ఇంటి నుంచి స్వగ్రామం వాడపల్లికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కుమారులను కోల్పోయిన గురమ్మ రోదన అక్కడికి వచ్చిన అందరినీ కలచివేసింది.   

లారీని ఢీకొట్టడంతో యువకుడి దుర్మరణం
చిలుకూరు (కోదాడ) : ఆగి ఉన్న లారీని ఆటో ఢీ కొట్టడంతో ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చిలుకూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం కో దాడ మున్సిపాలిటీ పరిధి లోని బాలాజీనగర్‌కు చెందిన వెన్ను రామకృష్ణ (28)కు సొంత ఆటో ఉంది. దాంతో దా నిమ్మకాయలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం కూడా తన ఆటోలో దానిమ్మ కాయలను హుజూర్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో విక్రయించి రాత్రి సమయంలో తిరుగు ప్రయాణమయ్యాడు. అదే సమయంలో హుజూర్‌నగర్, కోదాడ రహదారిపై ఆగి ఉన్న లారీని అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగభూషణం తెలిపారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు