ముగ్గురి అనుమానాస్పద మృతి అంతా ‘మిస్టరీ’ !

26 May, 2021 11:13 IST|Sakshi
జలల్లాపురంలో విచారణ చేస్తున్న పోలీసులు

జోగుళాంబ గద్వాల జిల్లాలో ముగ్గురి అనుమానాస్పద మృతి

మానవపాడు మండలం జల్లాపురంలో ఘటన

ఆలస్యంగా వెలుగులోకి..

వివాదాస్పదంగా మారిన మరణాలు

కల్తీ కల్లు కారణమంటున్న గ్రామస్తులు

జిల్లాలో ఓ కీలక ప్రజాప్రతినిధిసెటిల్మెంట్‌ చేసినట్లు ఆరోపణలు

ఎక్సైజ్‌ అధికారులకు ముడుపుల ఎర ?

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: జోగుళాంబ గద్వాల జిల్లాలో ముగ్గురు వ్యక్తుల అనుమానాస్పద మృతి మిస్టరీగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించడంతో పాటు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం వివాదాస్పదమైంది. కల్తీ కల్లు కారణమని ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో ఫిర్యాదు చేసేందుకు బాధిత కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని ఓ కీలక ప్రజాప్రతినిధి భర్త రంగంలోకి దిగి సదరు కల్లు డిపో బాధ్యులతో కలిసి బాధిత కుటుంబాలతో మాట్లాడి సెటిల్మెంట్‌ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో పలువురు ఎక్సైజ్‌ అధికారులకు ముడుపులు అందినట్లు సమాచారం.

7వ తేదీన ఒకరెనుక ఒకరు.. 
జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన వెంకట్రాముడు (55), పింజరి సిద్దయ్య (47), వెంకన్న (60)కు కల్లు తాగే అలవాటు ఉంది. దాదాపుగా ప్రతి రోజూ వీరు కల్లు తాగుతారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ముగ్గురు రోజు వారీగానే ఈ నెల ఏడో తేదీన కల్లు తాగి సాయంత్రం వారివారి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత ఒకరెనుక ఒకరు మృతి చెందారు. తెల్లారి ఉదయం గుట్టుచప్పుడు కాకుండా కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే వీరి మృతికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో ఏ విషయం బయటికి రాలేదు. కానీ ఆ ముగ్గురి అనుమానాస్పద మృతిపై ఇటీవల గ్రామంతో పాటు జిల్లావ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగింది.

ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు? 
అనుమానాస్పదంగా ముగ్గురు మృతి చెందడంతో ఉలిక్కిపడిన కల్లు డిపో పెద్దలు వెంటనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కకుండా కుటుంబాలతో సంప్రదింపులు జరిపేలా జిల్లాలో ఓ కీలక ప్రజాప్రతినిధి భర్త దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేసినట్లు గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఒక్కో కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.10 వేలు, 50 కిలోల బియ్యం అందజేసినట్లు తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.

ఎక్సైజ్‌ అధికారుల పాత్రపైనా అనుమానాలు  
ఈ ఘటనలో ఎక్సైజ్‌ అధికారులకు ముడుపులు అందాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముగ్గురి మృతి విషయం వెలుగులోకి రావడంతో ఎక్సైజ్‌ అధికారులు ఈ నెల 24న గ్రామాన్ని సందర్శించారు. నేరుగా కల్లు డిపోకు వెళ్లి శాంపిళ్లు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందు కలిపినట్లు తమకు ఆధారాలేవీ లభించలేదని.. అనుమానంతో శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు వెల్లడించారు. ఇక్కడ అనుమానాస్పదంగా ముగ్గురు మృతి చెందిన విషయాన్ని వెల్లడించకపోగా.. దాచిపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. తాజాగా మంగళవారం గద్వాల ఆర్డీఓ రాములు, డీఎస్పీ యాదగిరి గ్రామంలోని మృతి చెందిన బాధితుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మరో ఆరుగురు అస్వస్థతకు గురైనట్లు సమాచారం ఉందని వారు చెప్పారు. దీన్ని బట్టి తీగ లాగితే డొంక కదిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రాజకీయ కుట్ర ఉందా.. 
గద్వాల జిల్లాలో సంబంధించి అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకే పారీ్టకి చెందిన నాయకుల మధ్య పోరు నువ్వా.. నేనా అన్నట్లు కొనసాగుతోంది. జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధికి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు పొసగడం లేదు. జల్లాపురంలో ముగ్గురి అనుమానాస్పద మృతికి సంబంధించి అధికార పార్టీ శ్రేణుల్లో చర్చ ఈ ముగ్గురి నేతల చుట్టే సాగుతోంది. ఇందులో ఏమైనా కుట్ర జరుగుతోందా.. ఈ ప్రచారం వెనుక ఎవరు ఉన్నారు.. వంటి అంశాలు హాట్‌టాపిక్‌గా మారాయి.

దీనిపై సదరు జిల్లా కీలక ప్రజాప్రతినిధి భర్త ‘సాక్షి’తో మాట్లాడుతూ..‘రాజకీయ కక్షలతోనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. గ్రామంలో ముగ్గురు చనిపోయిన విషయం వాస్తవమే. మేము ఆ సమాచారం తెలుసుకొని గ్రామానికి వెళ్లాం. అక్కడి పరిస్థితిని చూసి అధికారులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాం. అంత్యక్రియల కోసం ఇద్దరికి డబ్బులు పంపించాం. అందులో ఒక్కరు మాత్రమే తీసుకున్నారు. పదేళ్లుగా గ్రామంలో పెళ్లిలు, శుభకార్యాలకు, మట్టి ఖర్చులకు ఇస్తున్నాం. ఇప్పుడు అలాగే ఇస్తున్నాం. కానీ ఒక బీసీ నాయకురాలు ఎదగడం ఇష్టం లేని కొందరు రాజకీయంగా ఇబ్బందులు పెట్టడానికి ప్రయతి్నస్తున్నారు. విచారణ చేసి నిజనిజాలు వెలికితీయాలని మేము పోలీసులను కోరాం.’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు