కారుతలుపు తెరుచుకోక..

7 Aug, 2020 12:18 IST|Sakshi
రోదిస్తున్న చిన్నారి యాస్మిన్‌ తల్లి అమీనా బేగం

ముగ్గురు చిన్నారులు మృతి 

రేమల్లేలో విషాదం 

మృతులు ముగ్గురు ఆరేళ్ల ఆడ పిల్లలే 

మృతుల తల్లిదండ్రులు వలస కార్మికులు 

రేమల్లే (హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌):  అప్పటి వరకూ హుషారుగా, కేరింతలు కొడుతూ ఆడుకున్న పిల్లలు కొద్దిసేపటికే విగతజీవులుగా మారారు. బాపులపాడు మండలం రేమల్లేలో పెను విషాదం చోటు చేసుకుంది.  గ్రామంలోని మోహన్‌ స్పిన్‌టెక్స్‌ ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో గురువారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాల్లో వెళ్లితే.. అస్సాంకు చెందిన ఎండీ షాజహన్‌ ఆలీ, సంగీత, అమీనా బేగం, పశ్చిమ బెంగాల్‌కు చెందిన షేక్‌ హాసీం, రపెరన్‌లు జీవనోపాధి నిమ్తితం ఇక్కడకు వచ్చారు. ఏడాది కాలంగా వారంతా  ఫ్యాక్టరీ క్వార్టర్స్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం షాజహన్‌ ఆలీ రెండో కుమార్తె సుహానా పర్వీన్‌ (6), అమీనా బేగం మొదటి కూతురు రింపా యాస్మిన్‌ (6), షేక్‌ హాసీం మూడవ కుమార్తె అప్సానా (6)లు క్వార్టర్స్‌ ప్రాంగణంలో ఆడుకుంటున్నారు. అదే ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉద్యోగి కారును క్వార్టర్స్‌ వద్ద నిలిపి ఉంచటంతో ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ సరదాగా ఆ కారులోకి ఎక్కారు. ఆ తర్వాత కారు డోర్లు మూసుకుపోయి ముగ్గురు చిన్నారులు ఆ వాహనంలో ఇరుక్కుపోయారు. 

గంటపాటు కారులో ఉక్కిరిబిక్కిరై..!
ఆడుకునేందుకు కారులోకి ఎక్కిన చిన్నారులకు ఆ తర్వాత డోర్లు తీయటం తెలియకపోవటం, సమీపంలో ఎవ్వరూ లేకపోవటంతో దాదాపు గంట సేపు కారులో నానా తంటాలు పడ్డారు. కారులో ఊపిరి అందక, ఆసలు ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బయటకువచ్చేందుకు మార్గం తెలియక, శ్వాస అందక ఆ చిన్నారులు చివరి నిముషాల్లో పడిన తాపత్రయం వర్ణనాతీతం. అభంశుభం తెలియని ఆ పిల్లలు కారులో ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులకు గురై చివరకు మృతి చెందారు. కొద్దిసేపటికే అటుగా వెళ్తున్న కొందరు కార్మికులు కారులో పిల్లలు పడిపోయి ఉండటాన్ని గుర్తించి డోర్లు తీసేందుకు యత్నించారు. కారు యాజమానిని పిలిచి డోర్లు తెరిచే సరికే చిన్నారుల నోట్లో నుంచి రక్తం కారుతుండటాన్ని గమనించి వీరవల్లి పోలీసులు, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అప్పటికే ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్లు అంబులెన్స్‌ సిబ్బంది గుర్తించారు. వీరవల్లి ఎస్‌ఐ ఎన్‌.చంటిబాబు చిన్నారులు మృతిపై ప్రాథమిక విచారణ     చేపట్టారు. 

శోకసంద్రంలో మృతుల కుటుంబాలు.. 
అప్పటి వరకూ నవ్వుతూ, తుళ్లుతూ తిరిగిన తమ పిల్లలు మృతదేçహాలుగా మారటంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన, ఆర్తనాదా లు మిన్నంటాయి. క్వార్టర్స్‌లోని తోటి కార్మికులు ఈ దుర్ఘటనతో విషాదంలోకి జారుకున్నారు. మృతుల తల్లిదండ్రులను ఓదార్చటం కష్టతరమైంది. బ్రతుకు దెరువు కోసం వస్తే కడుపుకోత మిగిలిందని రోదించటం చూపరులను సైతం కంటతడి పెట్టించింది.  కాగా అస్సాం రాష్ట్రంలోని బష్కా జిల్లా తమల్‌పూర్‌ గ్రామానికి చెందిన షాజహాన్‌ ఆలీ, సంగీత దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు కాగా సుహానా పర్వీన్‌ రెండో కుమార్తె. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని చుప్రిజారాకు చెందిన షేక్‌ హాసీం, రపెరన్‌ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా మృతి చెందిన అప్సానా మూడో సంతానం. అస్సాంలోని తమల్‌పూర్‌కు చెందిన అమీనా బేగం భర్త చనిపోవటంతో జీవనోపాధి కోసం తన కుమార్తె రింపా యాస్మిన్‌ను తీసుకుని ఇక్కడకు వచ్చింది. కాగా, ముగ్గురు ఆడ పిల్లలు రెండోవ తరగతి చదువుతున్నారు. 

మరిన్ని వార్తలు