ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి...

24 Apr, 2021 08:10 IST|Sakshi
సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న సీఐ

ఖానాపూర్‌: ఓ నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి మోసం చేసిన ముగ్గురు యువకులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ శ్రీదర్‌గౌడ్‌ తెలిపారు. స్థానిక పోలీస్‌ ష్టేష న్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. జల్సాలకు అ లవాటు పడిన ముగ్గురు యువకులు మోసాలు చేసి డబ్బులు సంపాదించడం పనిగా పెట్టుకున్నారు. మండలంలోని సుర్జాపూర్‌ గ్రామంలో ఆర్‌ఎంపీగా ప్రాక్టిస్‌ చేసే కొంపెల్లి నరేందర్, మరో వ్యక్తి కొంపెల్లి రవిలు మస్కాపూర్‌ గ్రామానికి చెందిన షారుఖ్‌ ఖాన్‌ అనే నిరుద్యోగికి మస్కా కొట్టి మూడు లక్షలు కాజేశారు.

సాంఘిక సంక్షేమ శాఖలో అటెండర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి షారుఖ్‌ ఖాన్‌ వద్ద 2019లో రూ. 3 లక్షలు వసూలు చేశారు. ఇరువురూ చెరో లక్ష తీసుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో జాయినింగ్‌ కోసం ఫేక్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ తయారు చేసి ఇచ్చిన ఉట్నూర్‌కు చెందిన మరో యువకుడు జాడి మహెందర్‌కు మరో లక్ష ఇచ్చారు. రెండేళ్లుగా రేపు, మాపు అంటూ ఉద్యోగం పేరుతో కాలం వెల్లదీశారు. నిందితులు ఇచ్చిన జాయినింగ్‌ లెటర్‌ ఫేక్‌ అని కొద్ది నెలల క్రితం తేలడంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని షారుక్‌ ఇరువురిని కోరాడు.

వారి నుండి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి ఈ నెల 18న పోలీస్‌ ష్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి ఉద్యోగం పేరుతో నిరుద్యోగిని మోసం చేశారు.  ఇరువురి నుంచి పోలీసులు రూ. 40 వేలు రికవరీ చేశారు.  శుక్రవారం ముగ్గురిని అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ విధించారు. కేసు విచారణను త్వరగా ఛేదించి నిందితులను అనతి కాలంలోనే అరెస్టు చేసిన ఎస్‌ఐ రామునాయక్‌తో పాటు కానిస్టేబుళ్ళు, హోంగార్డును సీఐ అభినందించారు. 

మరిన్ని వార్తలు