యూట్యూబ్‌లో చూసి బైకుల చోరీ.. ఓన్లీ స్పోర్ట్స్‌ బైక్స్‌యే సుమీ..!

13 Jul, 2021 09:41 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న వాహనాలతో పోలీసులు

12 రోజుల్లో.. 8 బైక్స్‌ చోరీ

నిందితుల అరెస్టు, వాహనాలు సీజ్‌

సాక్షి, హైదరాబాద్‌: పార్కింగ్‌ వసతి లేని హాస్టళ్ల బయట పార్క్‌ చేసిన పల్సర్‌ కంపెనీ స్పోర్ట్స్‌ బైక్స్‌ను టార్గెట్‌గా చేసుకుని వరుస చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాకు ఆసిఫ్‌నగర్‌ పోలీసులు చెక్‌ పెట్టారు. ఈ గ్యాంగ్‌ కేవలం 12 రోజుల వ్యవధిలో ఎనిమిది వాహనాలను తస్కరించినట్లు పశ్చిమ మండల సంయుక్త పోలీసు కమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతి, ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రవీందర్‌తో కలిసి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, నరసరావుపేట ప్రాంతాలకు చెందిన శివరాత్రి చందు, చింతగుంట శివనాగ తేజ, గొల్ల మధు స్నేహితులు. ప్రైవేట్‌ ఉద్యోగులైన వీరిలో నాగతేజ ప్రస్తుతం కుందన్‌ బాగ్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ ముగ్గురూ మద్యానికి బానిసలుగా మారారు. ఏపీ కంటే తెలంగాణలో మద్యం ధరలు తక్కువ కావడంతో తాగడానికే చందు, మధు తరచూ తేజ వద్దకు వచ్చేవాళ్లు.

పగలంతా మద్యం సేవించి రాత్రికి మళ్లీ బస్సెక్కి వెళ్లిపోయేవారు. ఇటీవల కాలంలో మద్యానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఈ ముగ్గురూ కలిసి వాహనాలు చోరీ చేయాలని పథకం వేశారు. ఆసిఫ్‌నగర్, ఎస్సార్‌ నగర్‌ ప్రాంతాల్లో ని హాస్టళ్లలో పార్కింగ్‌ సదుపాయం లేకపోవడంతో హాస్టళ్లలో ఉండే వాళ్ల స్పోర్ట్స్‌ బైకులను చోరీ చేసేందుకు ప్లాన్‌ వేసుకున్నారు.

వాటిని ఎలా తస్కరించాలో తెలుసుకోవడానికి యూట్యూబ్‌లో సెర్చ్‌ చేశారు. ఆ వీడియోల ఆధారంగా చోరీలు చేయడం ప్రారంభించారు. చోరీ చేసిన వాహనాలను నరసరావుపేటలోని మధు ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో దాచి.. మళ్లీ సిటీకి వచ్చేవాళ్లు. ఇలా కేవలం 12 రోజుల్లో ఆసిఫ్‌నగర్, ఎస్సార్‌నగర్, కేపీహెచ్‌బీల్లో 8 పల్సర్‌ స్పోర్ట్స్‌ బైక్స్‌ చోరీ చేశారు. ఈ చోరీలను ఛేదించడానికి ఆసిఫ్‌నగర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ టీమ్‌ రంగంలోకి దిగింది. దాదాపు 100 సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను పరిశీలించిన టీమ్‌ అందులో దొరికిన క్లూతో ముగ్గురినీ అరెస్టు చేసి, 8 వాహనాలు స్వాదీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు