ముగ్గురు మావోయిస్టు మిలిటెంట్ల అరెస్టు 

3 Aug, 2020 04:14 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి 

414 తూటాల డంపు, పార్టీ సాహిత్యం స్వాధీనం 

వివరాలు వెల్లడించిన మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ  

మహబూబాబాద్‌ రూరల్‌: ముగ్గురు మావోయిస్టు మిలిటెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 414 తుపాకీ తూటాల డంపు, పార్టీ సాహిత్యాన్ని స్వా«ధీనం చేసుకున్నారు. ఆదివారం మానుకోట సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. జిల్లాలోని గంగారం మండలం దుబ్బగూడెం గ్రామ పరిధి మామిడిగూడెం, మిర్యాలపేట ప్రాంతాలకు చెందిన బండి సుధాకర్, కల్తి సమ్మయ్య, పోలెబోయిన సారయ్య మావోయిస్టు మిలిటెంట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పక్కా సమాచారం మేరకు పోలీసులు ఆ ముగ్గురిని ఆదివారం దుబ్బగూడెంలో అరెస్టు చేశారు. వారిని విచారించిన పోలీసులు రామారం, పొనుగొండ్ల గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఒక డంపులోని మూడు వేర్వేరు బ్యాగుల్లో 414 తూటాలను స్వాధీనం చేసుకున్నారు.

కొంత కాలం క్రితం మావోయిస్టు పార్టీ నాయకులైన యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్, బడె చొక్కారావు అలియాస్‌ దామోదర్, కంకణాల రాజిరెడ్డి, కుర్పం మంగు అలియాస్‌ భద్రు, మడకం సింగి అలియాస్‌ అనిత అలియాస్‌ శాంత, ముచాకి ఉంగాల్‌ అలియాస్‌ సుధాకర్, కర్ణాకర్‌ అలియాస్‌ క్రాంతి, కొవ్వాసి గంగా అలియాస్‌ మహేశ్, వెట్టి భీమాలు అలియాస్‌ భీమా, యాలమ్‌ నరేందర్‌ అలియాస్‌ సంపత్, కొమ్ముల నరేశ్‌ అలియాస్‌ బయ్యన్న, మేదరి భిక్షపతి అలియాస్‌ విజేందర్‌తో పాటు మరికొంత మంది వీరి వద్ద తూటాలను దాచిపెట్టారని ఎస్పీ వివరించారు. ఈ ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, ముగ్గురు మిలిటెంట్ల అరెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన గూడూరు సీఐ బాలాజీ, కొత్తగూడ, గంగారం ఎస్సైలు తాహెర్‌బాబా, రామారావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ సాగర్, ఎస్‌బీ హెడ్‌ కానిస్టేబుల్‌ నిజాముద్దీన్, డీఎస్పీ ఆంగోతు నరేష్‌కుమార్‌ను ఎస్పీ కోటిరెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు.  

రాష్ట్రంలో మళ్లీ తిష్ట వేయడానికి.. 
మావోయిస్టులు మళ్లీ తెలంగాణలో తిష్ట వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రజలు మావోయిస్టు నక్సల్స్‌ను తిరస్కరించడం వల్ల ఈ ప్రాంతంలో పనిచేసే వారంతా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లిపోయారని తెలిపారు. మళ్లీ ఇక్కడ అలజడి సృష్టించేందుకు మావోయిస్టు కేంద్ర కమిటీ పథకం పన్ని హరిభూషణ్, కంకణాల రాజిరెడ్డి, దామోదర్, భద్రు, ఆజాద్‌లను తెలంగాణలో పని చేయాలని పంపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌ గుత్తికోయ నక్సల్స్‌ను సైతం పంపుతోందని, ప్రజలు వారి కుయుక్తులను నమ్మవద్దని ఎస్పీ సూచించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు