దండకారణ్యంలో ఎన్‌కౌంటర్‌

13 Oct, 2021 05:14 IST|Sakshi

ముగ్గురు మావోయిస్టుల మృతి

మృతుల్లో ఇద్దరు మహిళా మావోలు

జవాన్‌కు గాయాలు

పాడేరు (విశాఖ)/మల్కన్‌గిరి (ఒడిశా): ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దున దండకారణ్యంలో మంగళవారం ఉదయం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తులసి పహాడ్‌ ప్రాంతంలోని ఓ చోట మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు మల్కన్‌గిరి ఎస్పీ ప్రహ్లాద్‌ సాయిల్‌ మిన్నాకి సమాచారం అందింది. అప్రమత్తమైన ఆయన ఆ ప్రదేశంలో కూంబింగ్‌ నిర్వహించాల్సిందిగా ఎస్‌వోజీ, డీబీఎఫ్‌ జవాన్లను ఆదేశించారు. దీంతో సోమవారం రాత్రి నుంచి కూంబింగ్‌ చేపట్టిన జవాన్లకు మంగళవారం ఉదయం మావోయిస్టుల శిబిరం కనిపించింది.

జవాన్ల రాకను పసిగట్టిన మావోయిస్టులు వారి నుంచి తప్పించుకునేందుకు వారిపై కాల్పులు జరిపారు. ఆ వెంటనే జవాన్లు కూడా కాల్పులు ప్రారంభించారు. దాదాపు 2 గంటలపాటు సాగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు దుర్మరణం చెందారు. మావోలు విసిరిన గ్రెనేడ్‌ దాడిలో ఓ జవాన్‌కు గాయాలయ్యాయి. మరణించిన మావోయిస్టుల్లో ఆంధ్రా కేడర్‌కు చెందిన చిన్నారావు, మహిళా మావోయిస్టు సోనీ, మరో మహిళా మావోయిస్టు ఉన్నారు.కాగా, కొందరు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకుని పరారయ్యారు.

అనంతరం మావోయిస్టుల శిబిరంలోని డంప్‌ నుంచి వివిధ రకాల తుపాకులు, బుల్లెట్లు, మందుగుండు సామగ్రి, మావోయిస్టుల యూనిఫాం, వంట సామగ్రి, మందులు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో మావోయిస్టుల మృతదేహాలను పోలీసు బలగాలు మోసుకుని వస్తున్నట్టు తెలిసింది.

రోడ్డు మార్గానికి చేరేంత వరకు మృతదేహాల తరలింపులో ఎస్‌వోజీ బలగాలు అష్టకష్టాలు పడుతున్నట్టు సాయంత్రానికి శాటిలైట్‌ ఫోన్‌లో పోలీసు అధికారులకు సమాచారం అందింది. ఘటనలో మరికొందరు మావోలు తప్పించుకోవడంతో పోలీసు బలగాలు కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి. శిబిరంలో మల్కన్‌గిరి–కొరాపుట్‌–విశాఖ డివిజినల్‌ మావోయిస్టు అగ్రనేతలు రాకేష్, అరుణ ఉన్నట్టు సమాచారం అందడంతోనే కూంబింగ్‌ జరిపామని, నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో మూడుసార్లు ఎదురుకాల్పులు జరిగాయని ఎస్పీ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు