తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య

9 Aug, 2020 05:18 IST|Sakshi
డి.బాబుల్‌రెడ్డి, శ్వేత, సాయి (ఫైల్‌ ఫొటోలు)

కుమార్తె పడుతున్న కష్టాలు చూడలేక బలవన్మరణానికి పాల్పడ్డ తండ్రి 

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో విషాదం 

కమలాపురం: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ముగ్గురి ప్రాణాల్ని బలి తీసుకుంది. అల్లుడి వేధింపులతో కూతురు పడుతున్న కష్టాలు చూడలేక తండ్రి ఆత్మహత్య చేసుకుంటే, తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో ఈ విషాద ఘటన జరిగింది. బంధువులు తెలిపిన సమాచారం మేరకు.. ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్‌ కాలనీకి చెందిన డి.బాబుల్‌రెడ్డి (55)కి ఇద్దరు కుమార్తెలు శ్వేత, సాయి ఉన్నారు.పెద్ద కుమార్తె శ్వేతను అదే మండలంలోని తాళ్లమాపురం గ్రామానికి చెందిన సురేష్‌ కుమార్‌రెడ్డికి ఇచ్చి సంవత్సరం క్రితం వివాహం చేశారు.  శ్వేత, సురేష్‌కుమార్‌రెడ్డిల మధ్య ఆరు నెలల నుంచి వివాదాలు తలెత్తాయి. సురేష్‌ కుమార్‌రెడ్డి తరచూ వేధించడంతో శ్వేత పుట్టింటికి వచ్చేసింది.

అల్లుడి వేధింపులు తట్టుకోలేక, కుమార్తె పడుతున్న బాధలు చూడలేక బాబురెడ్డి తనువు చాలించాలనుకున్నాడు. శుక్రవారం సెల్ఫీ వీడియో తీసుకుని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రిలో తండ్రి మృతదేహాన్ని చూసిన కుమార్తెలు శ్వేత, సాయి తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. శనివారం ఉదయం కమలాపురం మండలం రాయునిపేట, ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు మధ్య రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప రైల్వే పోలీసులు శవ పంచనామా నిర్వహించి మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు