నాన్నా... నీ వద్దకే వస్తున్నాం! 

1 Dec, 2020 07:43 IST|Sakshi
అరుణ్‌పాండియన్‌తో భార్య, కుమార్తెలు (ఫైల్‌) 

ఇంటిపెద్ద మరణంతో మనోవేదనకు గురైన కుటుంబం 

భార్య సహా ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య 

మదురైలో ఘటన

సాక్షి, చెన్నై: ఇంటి పెద్ద మరణం ఓ కుటుంబాన్ని తీవ్ర మనోవేదనలోకి నెట్టింది. నీ వెంటనే మేమూ అంటూ ఆ కుటుంబంలోని ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన మదురైలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు..తిరుచ్చి సత్యమూర్తినగర్‌కు చెందిన అరుణ్‌పాండియన్‌(44) కాంట్రాక్టర్‌. ఆయనకు భార్య వలర్మతి(38), కుమార్తెలు అఖిల(19), ప్రీతి(17) ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో అరుణ్‌పాండియన్‌ అనారోగ్యానికి గురయ్యారు. మదురైలో చికిత్స తీసుకోవాల్సి రావడంతో మలై స్వామిపురంలోని వలర్మతి సోదరి సరస్వతి ఇంటికి పైఅంతస్తులో కొద్ది నెలలుగా ఉంటున్నారు.

జూలైలో అరుణ్‌ పాండియన్‌ మరణించాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం తీవ్ర మనోవేదనతో ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ముగ్గురు ఒకేగదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తాము పెంచుకుంటున్న శునకాన్ని సైతం గొంతు నులిమి హతమార్చారు. ఉదయం ఎంత సేపైనా వలర్మతి, పిల్లలు బయటకు రాకపోవడంతో సరస్వతి భర్త గణేషన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపు బద్దలు కొట్టి చూడగా తల్లి, కుమార్తెలు ఉరికి వేలాడుతూ కనిపించారు.   (కిరాతకం: కుటుంబం గొంతు కోశారు!)

ఫ్యామిలీ ఫొటో వద్ద ఓ లేఖను పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలను అందులో వివరించారు. తమ ఆస్తులను తన తల్లి లక్ష్మికి అప్పగించాలని వలర్మతి అందులో పేర్కొంది. తమ అంత్యక్రియులను తల్లి లక్ష్మి చేతుల మీదుగా చేయించాలని..తమతో పాటుగా శునకాన్ని ఖననం చేయాలని కోరారు. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి లేకపోవడం  కష్టతరంగా ఉందని, అందుకే నాన్న వద్దకే వెళుతున్నామని ఇద్దరు కుమార్తెలు లేఖలో పేర్కొనడం అందరి హృదయాలను బరువెక్కించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదురై జీహెచ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు