కన్నేసి... కాటేసి..

17 Oct, 2020 03:24 IST|Sakshi
నిందితులు నవీన్, జోసెఫ్, రాము..

బర్త్‌డేకు పిలిచి యువతిపై సామూహిక అత్యాచారం 

ముగ్గురు యువకుల అరెస్ట్‌

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ యువతిని బర్త్‌డే పార్టీ పేరుతో నగరానికి పిలిచి అత్యాచారానికి ఒడిగట్టిన విషయం మరువకముందే నగరంలో అటువంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. కేక్‌లో మత్తుమందు కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత ముగ్గురు యువకులు ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రెండు ఘటనల్లోనూ నిందితులు వేరైనా నేరం తీరు ఒకేరకంగా ఉంది. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌గా నమోదైన ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. ఎస్పీఆర్‌హిల్స్‌ వినాయకనగర్‌లో నివసించే బొందలగడ్ల నవీన్‌రెడ్డి(22) క్లీనర్‌గా పనిచేస్తుండగా అదే ప్రాంతంలో నివసించే మాధవ్‌జీ జోసెఫ్‌(20) ప్లాస్టిక్‌ గ్లాసుల విక్రయం చేస్తుంటాడు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో హౌస్‌ కీపింగ్‌ పనిచేసే రాగిని రాము(23) ముగ్గురూ ఫ్రెండ్స్‌ కాగా ఈ ముగ్గురికీ అదే ప్రాంతంలో నివసించే ఓ యువతితో పరిచయం ఏర్పడింది. నలుగురూ స్నేహితులుగా ఉండేవారు. ఎవరికి వారే ఆమెను ప్రేమలో పడేసేందుకు యత్నిస్తున్నారు. ఆ యువతి సికింద్రాబాద్‌లోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఈనెల 5న ఫీజు చెల్లించేందుకు ఇంట్లోంచి కాలేజీకి వెళ్లింది. 

కలసి వేడుక చేసుకుందామని..
యువతికి జోసెఫ్‌ ఫోన్‌ చేసి తన పుట్టినరోజు ఉందని అందరం కలసి సెలబ్రేట్‌ చేసుకుందామని చెప్పడంతో ఆమె ఒప్పుకుంది. నవీన్‌రెడ్డి, జోసెఫ్‌లు యువతి కళాశాలకు వెళ్లి ఆమెను బైక్‌పై కూకట్‌పల్లిలోని ఓయో రూమ్స్‌కు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ మరో స్నేహితుడు రాము వేచి ఉన్నాడు. ముగ్గురూ కలసి ముందస్తు ప్రణాళిక ప్రకారం కేక్‌పై మత్తు చల్లి ఆమెకు తినిపించారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్పృహలోకి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని రోదిస్తుండగా ఈ విషయం బయటికి చెబితే నగ్న దృశ్యాలు వైరల్‌ చేస్తామని బెదిరించారు. దీంతో ఆమె భయపడి ఆ రోజు ఎవరికీ చెప్పలేదు.

ఆరోగ్యం దెబ్బతినడంతో.. 
రెండ్రోజుల తర్వాత బాధిత యువతికి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఫిట్స్‌ రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు లోతుగా అడగడంతో జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. యువతి తల్లిదండ్రులు ఆ ముగ్గురు యువకులను పిలిపించి తిట్టారు. కూతుర్ని కొట్టారు. ఇదే విషయంపై బుధవారం రాత్రి తనపై అత్యాచారానికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటన కేపీహెచ్‌బీ ప్రాంతంలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. నిందితులను అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా