తెల్లారిన కూలీల బతుకులు

24 Feb, 2021 04:51 IST|Sakshi

మినీ లారీ బోల్తా–ముగ్గురి మృతి

మరో 20 మందికి తీవ్ర గాయాలు

గుంటూరు జిల్లాలో ఘటన

బాధితులు కర్నూలు జిల్లా వాసులు

వినుకొండ (నూజెండ్ల): పొట్టకూటి కోసం వలస వచ్చిన నిరుపేదల పాలిట మినీ లారీ మృత్యుపాశమయ్యింది. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా ముగ్గురి బతుకులు తెల్లారిపోగా.. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మంగళవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా వినుకొండ రూరల్‌ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి.  కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలోని పార్లపలి, మాసుమాను దొడ్డి, కొసిగి, పల్లెపాడు గ్రామాల నుంచి సోమవారం రాత్రి గుంటూరు జిల్లాకు సుమారు 100 మందికి పైగా వలస కూలీలు నాలుగు మినీ లారీల్లో బయలు దేరారు. యడ్లపాడు, పెదనందిపాడు ప్రాంతాల్లో మిర్చి, వేరుశనగ పొలాల్లో కూలి పనుల కోసం వీరంతా వస్తున్నారు.

వీరిలో మాసుమానుదొడ్డి గ్రామానికి చెందిన కూలీలతో  బయలుదేరిన  మినీ లారీ అందుగుల కొత్తపాలెం గ్రామ శివారులోని లక్ష్మక్క వాగు బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా అదుపుతప్పి బోల్తా కొట్టి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఘటనలో భీముడు (50), యర్నాల శ్రీనివాసరావు (6), వాహనం యజమాని, డ్రైవర్‌ బొంతల ఉమేష్‌కుమార్‌ నాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. వినుకొండ, బొల్లాపల్లి, ఈపూరు, నూజెండ్ల 108 వాహన సిబ్బంది సకాలంలో స్పందించి గాయపడ్డ వారిని పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనంలో ఇరుక్కుపోయిన మృత దేహాలతో పాటు గాయపడిన వారిని బయటకు తీసి జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తమ సహచరుల వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న మిగతా వలస కూలీలు భారీగా వినుకొండ ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకున్నారు. వారి రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగింది.  వారందరినీ స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 

మరిన్ని వార్తలు