సారా తనిఖీకి వెళ్లి.. చోరీ

11 Jun, 2021 07:20 IST|Sakshi

వేలూరు (తమిళనాడు): సారా తనిఖీలకు వెళ్లి రెండు ఇళ్లలో 15 సవరాల బంగారం, రూ. 8 లక్షల నగదు అపహరించిన ముగ్గురు పోలీసులను అధికారులు సస్పెండ్‌ చేస్తూ వారిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెలితే వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం నాచ్చంబట్టు అటవీ ప్రాంతంలో సారా విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అరియూర్‌ ఎస్‌ఐ అన్బయగన్, పోలీసులు తనిఖీకి వెళ్లారు. పోలీసులను చూసిన వెంటనే సారా వ్యాపారులు అక్కడ నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు అటవీ ప్రాంతంలోని సారా ఊటలను ధ్వంసం చేసి ఆ ప్రాంతంలోని ఇళ్లలో సారా కాచేందుకు బెల్లం, చెక్కర, చెక్కలు దాచి ఉంచారా..? అనే అనుమానంతో తనిఖీ చేశారు.

ఆ సమయంలో ఇళంగోవన్, సెల్వం అనే ఇద్దరి ఇళ్లకు తాళం వేసి ఉండడంతో పోలీసులు పగలగొట్టి మరీ తనిఖీలు చేపట్టారు. ఆ ఇళ్లలో ఉన్న రూ. 8.5 లక్షల నగదు, 15 సవరాల బంగారాన్ని అపహరించి వెళ్లిపోయేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న అటవీ ప్రాంత వాసులు తాళం పగలగొట్టి నగదు, బంగారం చోరీ చేయడం సరికాదని వాటిని అప్పగించాలని ముట్టడించారు. దీంతో పోలీసులు నగదు, బంగారాన్ని వారికి అప్పగించినట్లు తెలిసింది. నగదు, బంగారం అపహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఏఎస్పీ అల్‌బ్రెట్‌ జాన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన విచారణ జరిపి.. అరియూర్‌ ఎస్‌ఐ అన్బయగన్, పోలీసులు యువరాజ్, ఇళయరాజాను సస్పెండ్‌ చేయడమే కాకుండా కేసు నమోదు చేశారు.

చదవండి: ముంబైలో ఘోర ప్రమాదం    
అమ్మ కాకుండానే.. అనంతలోకాలకు..!

మరిన్ని వార్తలు