టెక్సాస్‌లో ముగ్గురు కృష్ణా జిల్లా వాసుల మృతి 

28 Sep, 2022 04:07 IST|Sakshi
మృతులు వాణిశ్రీ, ఆమె ఇద్దరు కుమార్తెలు

రోడ్డు ప్రమాదంలో డాక్టర్‌ శ్రీనివాస్‌ భార్య, ఇద్దరు కుమార్తెల దుర్మరణం 

కురుమద్దాలిలో విషాదఛాయలు  

పామర్రు : అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లా పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన తానా బోర్డు సభ్యుడు డాక్టర్‌ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌ భార్య వాణిశ్రీ, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. దీంతో కురుమద్దాలిలో విషాదఛాయలు నెలకొన్నాయి. కురుమద్దాలి గ్రామానికి చెందిన కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌ గుంటూరు మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. ఉన్నత చదువుల నిమిత్తం 1995లో అమెరికా వెళ్లారు.

చదువు అనంతరం అక్కడే వైద్యుడిగా స్థిరపడ్డారు. పీడియాట్రిక్‌ కార్డియో వాసు్క్యలర్‌ సర్జన్, అనస్తీషియాలజిస్ట్‌గా మంచి పేరుపొందారు. ఆయన భార్య వాణిశ్రీ ఐటీ ఉద్యోగి కాగా, పెద్ద కుమార్తె వైద్య విద్య, రెండో కుమార్తె 11వ తరగతి చదువుతున్నారు. కుమార్తెలు ఆదివారం కళాశాల వద్దకు వెళ్లగా, వాణిశ్రీ కారులో వారిని ఇంటికి తీసుకుని వస్తుండగా టెక్సాస్‌లోని వాలర్‌ కౌంటీ వద్ద వారి కారును ఓ వ్యాను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వాణిశ్రీ, ఆమె ఇద్దరు కుమార్తెలు మరణించారు. భార్యాపిల్లలను కోల్పోవడంతో డాక్టర్‌ శ్రీనివాస్‌ ప్రస్తుతం షాక్‌లో ఉన్నారు. ఈ విషయం తెలిసిన కురుమద్దాలి గ్రామస్తులు విచారం వ్యక్తంచేశారు. డాక్టర్‌ శ్రీనివాస్‌ తండ్రి కొడాలి రామ్మోహన్‌రావు ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్‌ అయిన తర్వాత విజయవాడలో స్థిరపడ్డారు.    

మరిన్ని వార్తలు