ఇదో పెద్ద ఫోర్జరీ బాగోతం.. స్నేహితుడని నమ్మితే

5 Jan, 2022 12:10 IST|Sakshi

ఫోర్జరీ సంతకాలతో మిత్రుడి డాక్యుమెంట్లు తనఖా

ఆస్తిదారుడి ప్రమేయం లేకుండా కోట్లలో రుణాలు 

రూ.15 కోట్ల పైనే రుణాలు తీసుకున్నట్లు సమాచారం

ఎస్‌బీఐ అధికారులతో కుమ్మక్కుపశ్చిమ గోదావరి జిల్లాలోని 3 బ్రాంచీల్లో బాగోతం

యజమానికి నోటీసులు రావడంతో వ్యవహారం వెలుగులోకి..

నలుగురు బ్యాంకు అధికారుల సస్పెన్షన్‌

కొవ్వూరు: ఇదో పెద్ద ఫోర్జరీ బాగోతం.. స్నేహితుడని నమ్మితే అప్పుల ఊబిలో ముంచేసిన వ్యవహారం.. ఇందుకు పలువురు బ్యాంకు అధికారుల సహకారం.. పశ్చిమ గోదావరి జిల్లాలోని 3 స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో ఫోర్జరీ సంతకాలతో రుణాలు పొందిన ఘటన ఇది. ఈ బాగోతంలో రూ.15 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇందులో పాత్రధారులుగా అనుమానిస్తున్న ముగ్గురు బ్యాంకు మేనేజర్లు, ఒక ఫీల్డ్‌ ఆఫీసర్‌ సస్పెండ్‌ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బాధితుడు గద్దె జయరామకృష్ణ గత డిసెంబర్‌ 4న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఇది వెలుగుచూసింది. ఈయన చెప్పిన వివరాల ప్రకారం..

కథ ఇలా మొదలైంది..
2018లో జయరామకృష్ణ ఢిల్లీలోని తన కుమార్తె వద్దకు వెళ్లే సమయంలో తన వద్దనున్న బంగారు ఆభరణాలు, పలు దస్తావేజులను బ్యాంకు లాకర్‌లో పెట్టాలని భావించారు. కానీ, స్నేహితుడైన కవల వెంకటనరసింహంతో ఈ విషయమై చర్చించగా ఆయనిచ్చిన భరోసాతో వాటిని వెంకటనరసింహం దగ్గరే భద్రపరిచారు. పదిరోజుల్లో తిరిగొచ్చాక నిందితుడు ఆభరణాలు తిరిగి ఇచ్చేయగా దస్తావేజులను మాత్రం లాకర్‌లో ఉన్నాయంటూ కాలయాపన చేశారు.

ఈలోగా 2018 చివరి నుంచి 2019 వరకు పలుమార్లు ఎస్‌బీఐకి చెందిన వివిధ బ్రాంచ్‌ల నుంచి జయరామకృష్ణ ప్రమేయం లేకుండా ఆయన దస్తావేజులు పెట్టి ఆయన పేర్లతోను, వివిధ వ్యక్తుల పేరుతోను వెంకటనరసింహం రుణాలు తీసుకున్నారు. కొన్ని రుణాలను జయరామకృష్ణ, ఆయన భార్య శ్రావణిని గ్యారంటీగా పెట్టి కూడా తీసుకున్నారు. మరికొన్ని వారి సంతకాలు ఫోర్జరీచేసి రుణాలు తీసుకున్నారు. ఇదే విధంగా కొవ్వూరు సమీపంలోని ప్రక్కిలంక ఎస్‌బీఐ శాఖలోనూ రుణాలు పొందినట్లు తెలుస్తోంది.

ఆస్తుల విలువను మార్కెట్‌ ధర కంటే ఎక్కువగా చూపించి రుణాలు పొందారు. ఇలా మొత్తం మీద రూ.15కోట్లకు పైగా పక్కదారి మళ్లించినట్లు సమాచారం. చివరికి ఈ రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు నోటీసులు పంపించారు. వారు రాజమండ్రిలోని బాధితుడి ఫ్లాటుని సీజ్‌ చేసి స్థలాల వద్ద నోటీసులు పెట్టారు. కానీ, వెంకటనరసింహానికి, తమకు ఏ వ్యాపార లావాదేవీలు లేవని.. కేవలం స్నేహంతో నమ్మకం మీద దస్తావేజులు ఆయనకిస్తే ఇలా మోసం చేశారని జయరామకృష్ణ అన్నారు. ఈ రుణాలకు, తమకు ఏ విధమైన సంబంధంలేదని ఆయన చెప్పారు.

నిందితుడిపై కేసు నమోదు
బాధితుడి ఫిర్యాదు మేరకు కొవ్వూరు పట్టణ పోలీసులు 564/2021 అండర్‌ సెక్షన్‌–406, 419, 420, 465 ఐపీసీ కింద వెంకటనరసింహంపై కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన కవల వెంకటనరసింహం అనే వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు స్వయానా అల్లుడు. కానీ.. ఈ కేసుకు, తన తండ్రి సోము వీర్రాజుకు ఎలాంటి సంబంధంలేదని ఆయన పెద్ద కుమార్తె సూర్యకుమారి స్పష్టంచేశారు.

రాజకీయ దురుద్దేశంతో తన తండ్రి పేరును ఈ కేసులో ప్రస్తావిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ కేసులో బ్యాంకు అధికారుల నుంచి డాక్యుమెంట్లతో కూడిన సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్‌ చెప్పారు. అప్పట్లో పనిచేసిన బ్యాంకు అధికారులకు నోటీసులు పంపి విచారణ జరుపుతున్నామన్నారు. ఇప్పటివరకు రూ.3.60 కోట్ల మేరకు రుణాలు పొందినట్లు గుర్తించామని.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తేనే మొత్తం రుణాల మొత్తం తెలుస్తుందన్నారు.

మరిన్ని వార్తలు