హైదరాబాద్: ముగ్గురు మహిళల అదృశ్యం కలకలం

13 Jun, 2021 12:32 IST|Sakshi

హిమాయత్‌నగర్‌: భర్త దగ్గరకు వెళ్తున్నానని తన సోదరుడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఏఎస్సై థాకూర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన నరేష్‌సింగ్, కమలాదేవిలు భార్యాభర్తలు. పదిహేను రోజుల క్రితం హైదర్‌గూడలోని బిశ్వకర్మ ఇంటికి వచ్చింది.

చాలా రోజులైన కారణంగా శుక్రవారం భర్త నరేష్‌సింగ్‌ కమలదేవికి ఫోన్‌ చేసి ఇంటికి రావాలన్నాడు. సరే వస్తున్నానంటూ ఇంట్లో నుంచి బయలుదేరిన కమలాదేవి భర్త దగ్గరకు వెళ్లలేదు. సమీప బంధువుల్ని ఆరా తీసినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో కమలాదేవి సోదరుడు బిశ్వకర్మ శనివారం నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సదరు మహిళ కోసం గాలింపు చేస్తున్నట్లు ఏఎస్సై థాకూర్‌ తెలిపారు.  

గృహిణి అదృశ్యం  
గౌలిపురా: ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైంది. ఈ సంఘటన భవానీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్‌కట్టా జహంగీర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఆఫ్రీన్‌ అంజుమ్‌ రహ్మత్‌ ఖాన్, రహమత్‌ ఖాన్‌ దంపతులు. కాగా ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆఫ్రీన్‌ మహరాష్ట్రలోని తల్లిగారింటికి వెళ్తున్నానని భర్తతో చెప్పింది.

ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన ఆఫ్రీన్‌ అంజుమ్‌ రాత్రి 11.30 గంటలకు కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. నిద్రలేచిన రహ్మత్‌ ఖాన్‌కు భార్య కనిపించకపోవడంతో  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 040–27854798లో సమాచారం అందించాలన్నారు.

విద్యార్థిని అదృశ్యం 
మల్కాజిగిరి: విద్యార్థిని అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజేఆర్‌నగర్‌కు చెందిన బాలరాజు కూతురు వెన్నెల(21) ఎంబీఏ చదువుతోంది. ఈ నెల 11వ తేదీ ఉదయం ఘట్‌కేసర్‌లో తను చదువుతున్న కాలేజీలో ల్యాబ్‌ పరీక్షకు వెళ్తున్నానని కుటుంబసభ్యులకు తెలిపింది.

అదేరోజు సాయంత్రం బాలరాజు వెన్నెలకు ఫోన్‌ చేస్తే ఉప్పల్‌లో ఉన్నా ఇంటికి వస్తున్నానని చెప్పింది. కొద్ది సేపటి తర్వాత నుంచి ఆమె ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. ఆమె కోసం వెతికినా ఆచూకీ లేకపోవడంతో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: పెళ్లి పేరుతో యువతి మోసం.. రూ.ఆరు లక్షలతో పరార్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు