దూసుకొచ్చిన మృత్యువు 

24 May, 2022 05:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మోటారు సైకిళ్లు ఢీకొని పడిపోయిన వారిపై నుంచి వెళ్లిన లారీ 

ముగ్గురు యువకులు మృతి 

గిద్దలూరు: రోడ్డు ప్రమాదంలో పడిపోయిన వారిపైకి మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. ముగ్గురు యువకుల జీవితాలను బలితీసుకుంది. ఆ కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని మోడంపల్లె క్రాస్‌ రోడ్డు వద్ద సోమవారం రాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో గిద్దలూరుకు చెందిన మేరుగ హనోక్‌ (25), క్రిష్ణంశెట్టిపల్లె గ్రామానికి చెందిన కొమ్మునూరి ప్రసన్న (24), పెద్దపీరయ్య (24) దుర్మరణం పాలయ్యారు. హనోక్‌ నంద్యాల సమీపంలోని బిల్లలాపురంలో ఉన్న భార్య దగ్గరకు మోటారు సైకిల్‌పై వెళ్తుండగా.. ప్రసన్న, పెద్దపీరయ్య మరో మోటారు సైకిల్‌పై ఎదురుగా వచ్చారు. రెండు మోటారు సైకిళ్లు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు యువకులు రోడ్డుపై పడిపోయారు.

అదే సమయంలో కర్నూలు జిల్లా అవుకు నుంచి గుంటూరుకు నాపరాళ్లపై మిర్చి బస్తాలు వేసుకుని వెళుతున్న లారీ.. రోడ్డు మీద పడిపోయిన ముగ్గురి పైనుంచి వెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హనోక్‌కు ఒక కుమార్తె ఉండగా, భార్య గర్భిణి. ప్రేమ వివాహం చేసుకున్న ప్రసన్నకు భార్య, కుమారుడు ఉన్నారు. పెద్దపీరయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.   

మరిన్ని వార్తలు