బైక్‌తో డివైడర్‌ను ఢీకొని ముగ్గురు యువకుల మృతి

13 Sep, 2021 04:51 IST|Sakshi

కొండపల్లి ఖిల్లాకు వెళ్లి వస్తూ మృత్యువాత

గొల్లపూడిలో హైవేపై ప్రమాదం

భవానీపురం (విజయవాడ పశ్చిమ): విజయవాడ సమీపంలోని గొల్లపూడి వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ఎదురుగా జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. పెనమలూరు మండలం గోసాలకు చెందిన సయ్యద్‌ సాదిక్‌బాబు (26), తాడిగడపకు చెందిన కొల్లా మణికంఠ (25), రషీద్‌ (18) స్థానికంగా ఎలక్ట్రికల్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ముగ్గురూ అవివాహితులే. ఆదివారం కావడంతో ముగ్గురూ కలిసి సరదాగా గడిపేందుకు ఇళ్ల నుంచి ఉదయం 8.30 గంటలకు ఒకే బైక్‌పై కొండపల్లి ఖిల్లాకు వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం ఇళ్లకు బయలుదేరారు.

గొల్లపూడి దాటి వ్యయసాయ మార్కెట్‌ యార్డ్‌ దగ్గరకు వచ్చేసరికి బైక్‌ అదుపు తప్పి సెంట్రల్‌ డివైడర్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన సయ్యద్‌ సాదిక్, మణికంఠ అక్కడికక్కడే మృతిచెందారు. కొన ఊపిరితో ఉన్న రషీద్‌ను స్థానికులు 108 అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కొద్దిసేపటి తరువాత అతడు కూడా మృతిచెందాడు. పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకున్నారు. సయ్యద్‌ సాదిక్, మణికంఠ మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు