విశాఖ ఏజెన్సీ ఘాట్‌ రోడ్డులో దుండగుల హల్‌చల్‌ 

14 Jan, 2021 05:09 IST|Sakshi
మహిళ మెడకు గాయాలైన దృశ్యం

నాటు తుపాకులతో బెదిరింపులు 

5 తులాల బంగారం, రూ.35 వేల నగదు దోపిడీ 

సీలేరు (పాడేరు): విశాఖ ఏజెన్సీ సీలేరు పోలీస్‌స్టేషన్‌ పరిధి ధారాలమ్మ ఘాట్‌ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి దుండగులు అరాచకం సృష్టించారు. ఆలయం సమీపంలోని రెండో మలుపు వద్ద దారి కాచి, అటుగా వచ్చిన కార్లపై దాడి చేసి బంగారం, నగదు, సెల్‌ ఫోన్లు దోచుకున్నారు. సీలేరు ఎస్‌ఐ రంజిత్‌ అందించిన వివరాలు.. మంగళవారం రాత్రి పంచాయతీరాజ్‌ జేఈ జ్యోతిబాబు సీలేరులో సచివాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించి రాత్రి 9 గంటలకు తిరిగి చింతపల్లికి కారులో వెళుతున్నారు. ధారాపురం ఘాట్‌రోడ్డు వద్ద రాత్రి 11.30గంటల సమయంలో ముసుగు ధరించిన ఐదుగురు దుండగులు వచ్చి కారును అడ్డగించారు.

అనుమానం వచ్చి వేగంగా వెనక్కి తిప్పేందుకు ప్రయత్నిస్తుంటే.. ఇనుపరాడ్లతో అద్దాలు ధ్వంసం చేశారు. అయితే ఆయన తప్పించుకుని వెళ్లిపోయారు. బుధవారం తెల్లవారు జామున 4.30 ప్రాంతంలో పాల్వంచ నుంచి సీలేరు మీదుగా లంబసింగికి కారులో ఐదుగురు వెళుతుండగా.. నాటు తుపాకులు, కత్తులతో బెదిరించి వారి వద్ద నుంచి రూ.35 వేల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు దోచుకున్నారు.
దుండగులు ధ్వంసం చేసిన కారు అద్దాలు 

అది జరిగిన మరో అరగంటలో సీలేరుకు చెందిన సత్యనారాయణ అనే వ్యాపారి.. భార్య ఈశ్వరమ్మతో కలిసి కారులో వెళ్తుండగా ఐదుగురు వచ్చి.. తాము పోలీసులమని, తనిఖీలు చేయాలని చెప్పారు. కారు అద్దాలు దించేలోగా ఇద్దరి మెడలోని ఐదు తులాల బంగారం గొలుసులను లాక్కుని పారిపోయారు. ఈ ఘటనలో మహిళ మెడకు గాయాలయ్యాయి. వెనుక నుంచి బస్సు వస్తుండటంతో దుండగులు పరారయ్యారు. దాడికి పాల్పడిన వారంతా ఒడిశాకి చెందిన వారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు