ఆసిఫాబాద్‌లో పులి చర్మం స్వాధీనం

1 Nov, 2021 04:01 IST|Sakshi

పలువురిని విచారిస్తున్న అటవీశాఖ 

సాక్షి, హైదరాబాద్‌: అక్రమంగా పులి చర్మాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అటవీశాఖ అధికారులు కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. కొట్నాక దేవరావు, గొడుగు అవినాశ్‌ అనే వ్యక్తులు ఈ చర్మాన్ని ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం వడగామ్‌ గ్రామం నుంచి తీసుకొచ్చినట్టు ఆదివారం రాత్రి అటవీశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వీరిద్దరిని విచారించిన అనంతరం ఈ కేసుకు సంబంధించి ఆదిలాబాద్‌ జిల్లా అటవీ అధికారి రాజశేఖర్‌ నేతృత్వంలో ఉట్నూరు, ఆసిఫాబాద్‌ ఎఫ్‌డీవోలు, కాగజ్‌నగర్‌ అటవీ సిబ్బంది వడగామ్‌ గ్రామానికి చెందిన మేస్రం మంకు, మేస్రం దీపక్, మేస్రం చంద్రకాంత్, మేస్రం ఈశ్వర్, మేస్రం లక్ష్మణ్‌లను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్టు అటవీ శాఖ తెలిపింది.

గత ఏడాది ఇంద్రవెల్లి మండలం వాలుగొండ గ్రామంలో పెందూరు దేవరావు అనే వ్యక్తి పొలంలో అడవి పందుల కోసం అమర్చిన ఉచ్చులకు చిక్కి పులి మరణించినట్టు తెలుస్తోందని ఆ ప్రకటన పేర్కొంది. అదే గ్రామంలోని పెందూరు ముకంద్‌రావు ఇంట్లో సోదా చేయగా పులి కింది దవడ, ఇతర ఎముకలు దొరికినట్లు తెలిపింది.

అదుపులోకి తీసుకున్న వారిని విచారణ అనంతరం, సిర్పూర్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపింది. కాగా, పవిత్ర దండారీ ఉత్సవాలు జరుగుతున్న సమయంలో అటవీ శాఖ అధికారులు సోదాల పేరుతో తమ ఇళ్లలోకి బూటుకాళ్లతో ప్రవేశించి సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలిగించారంటూ ఇంద్రవెల్లిలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఆదివాసీలు రెండు గంటల పాటు ఆందోళన చేశారు.   

మరిన్ని వార్తలు