గ్యాంగ్‌వార్‌: ‘హత్యలన్నీ సీరియల్‌గా జరిగాయి’

22 Sep, 2020 14:15 IST|Sakshi

తిరుపతి గ్యాంగ్‌వార్‌ ఘటనలో ఏడుగురి అరెస్టు

కేసు వివరాలను వెల్లడించిన అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డి

సాక్షి, చిత్తూరు: తిరుపతి గ్యాంగ్‌వార్‌ ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం దినేష్ అనే రౌడీ షీటర్‌ను కొందరు దుండగులు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు చెప్తున్నారు. దినేష్‌ హత్యకు నిందితులు ఉపయోగించిన మూడు కత్తులను స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసు వివరాలను తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేశ్‌ రెడ్డి మీడియాకు తెలిపారు. రెండేళ్ల క్రితం భార్గవ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని తెలిపారు.

భార్గవ్‌ హత్యకు బెల్ట్‌ మురళి కారణమని ప్రత్యర్థులు అతన్ని చంపేశారని వెల్లడించారు. ఇప్పుడు అతని వర్గీయులు దినేష్‌ను హతమార్చారని చెప్పారు. ఈ హత్యలన్నీ సీరియల్‌గా జరిగాయని ఎస్పీ వివరించారు. నగరంలోని ఐఎస్‌ మహల్‌ వద్ద రౌడీ షీటర్‌ దినేష్‌ (35) హత్యకు గురయ్యాడు. ట్యాక్సీ నడుపుతూ జీవన సాగిస్తున్న దినేష్‌ పనిముగించుకుని ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వెళుతుండగా ఐఎస్‌ మహల్‌ సమీపంలోని హారిక బార్‌ వద్ద కాపుగాసిన ప్రత్యర్థులు కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన దినేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. 
(చదవండి: పాత కక్షలు: రౌడీ షీటర్‌ దారుణ హత్య)

మరిన్ని వార్తలు