ఈడీ ఎదుటకు టీఎంసీ ఎంపీ అభిషేక్‌

7 Sep, 2021 06:07 IST|Sakshi

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీని సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సుదీర్ఘంగా దాదాపు 9 గంటలపాటు విచారణ జరిపారు. రాష్ట్రంలో జరిగిన బొగ్గు కుంభకోణంలో మనీల్యాండరింగ్‌ ఆరోపణలకు సంబంధించి అభిషేక్‌ సోమవారం ఢిల్లీలోని జామ్‌నగర్‌ హౌస్‌లో ఉన్న ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. తిరిగి ఆయన రాత్రి 8 గంటల సమయంలో వెళ్లిపోయారు. ఈ కేసులో ఇతర నిందితులతో సంబంధాలు, తన కుటుంబీకులకు చెందిన రెండు కంపెనీల్లో జరిగిన అక్రమ లావాదేవీలపై అభిషేక్‌ను అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు గనుల్లో అనేక కోట్ల అక్రమాలు చోటుచేసుకున్నట్లు 2020లో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అనూప్‌ మాఝి అలియాస్‌ లాలాను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఈ అక్రమాల్లో అభిషేక్‌ కూడా లబ్ధి పొందినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగానే అభిషేక్‌ భార్య రుజిరాకు కూడా నోటీసులు జారీ చేసింది. కానీ, ఆమె కరోనా తీవ్రత దృష్ట్యా రాలేకపోతున్నట్లు సమాచారం అందించడంతో, కోల్‌కతాలోనే అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేసిన ఈడీ.. కొందరు ఐపీఎస్‌ అధికారులతోపాటు, ఒక లాయర్‌ను కూడా విచారణకు రావాలంటూ సమన్లు జారీ చేసింది.

మరిన్ని వార్తలు