టీఎంసీలో కుమ్ములాట? కీలక నేత హత్య.. ఆపై ఏడుగురు మృతిపై అనుమానాలు!

22 Mar, 2022 15:13 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని బొగ్తుయ్ గ్రామంలో సోమవారం బర్షల్ గ్రామ పంచాయితీ డిప్యూటీ చీఫ్ తృణమాల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) నేత బాదు షేక్ బాంబు దాడిలో మరణించారు. అయితే ఆయన మరణించిన కొద్దిగంటల్లో చోటు చేసుకున్న ఓ అగ్నిప్రమాదంలో ఏడుగురు చనిపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తృణమాల్‌ కాంగ్రెస్‌లోని ఒక వర్గానికి చెందిన వాళ్లే.. ఆ ఇంటికి నిప్పటించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండల్‌ మాత్రం షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని చెబుతున్నారు. పైగా ఆయన అంతర్గత తగాదాలు, ప్రతీకార దాడుల వంటివి ఏం జరగలేదని ఆ ఆరోపణలన్నింటిని ఆయన ఖండించారు. సుమారు 10 ఇళ్లు మంటల్లో చిక్కుకున్నట్లు అగ్రిమాపక సిబ్బంది తెలిపింది. పైగా ఒకే ఇంట్లో గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన ఏడు మృతదేహాలు లభించాయని వెల్లడించింది.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు సూపరింటెండెంట్ నాగేంద్ర నాథ్ త్రిపాఠి ఫోరెన్సిక్ పరీక్ష ద్వారా మాత్రమే అగ్నిప్రమాదానికి గల కారణాలను నిర్ధారించగలమని చెప్పారు. ముసుగులు ధరించి మోటార్‌సైకిళ్లపై వచ్చిన నలుగురు వ్యక్తులు షేక్‌పై దాడి చేశారని స్థానికులు చెబుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య వైరం కారణంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోందన్నారు.

హత్య అనంతరం పలు ఇళ్లను కూడా ధ్వంసం చేశారని చెప్పారు. సీఐడీ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారించడం మొదలు పెట్టింది. బాదు షేక్ సోదరుడు బాబర్ షేక్ కూడా ఏడాది క్రితం ఇదే గ్రామంలో హత్యకు గరైయ్యారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు టీఎంసీ బ్లాక్ యూనిట్ ప్రెసిడెంట్ అనరుల్ హుస్సేన్ పార్టీ కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలని, ప్రతీకార చర్యలకు పాల్పడవద్దని కోరారు.  రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రతిపక్ష బీజేపీ నాయకుడు సమిక్ భట్టాచార్య పిలుపునిచ్చారు. ఈ తరహా అనాగరిక దాడులు మధ్య యుగాలలో జరిగేవని అన్నారు. 

(చదవండి: రోడ్డు దాటుతున్న బాలిక.. అంతలో బీబీఎంపీ లారీ వచ్చి..)

>
మరిన్ని వార్తలు