చిత్రహింసలు: రక్తపు మరకలు తుడవాలంటూ

27 Oct, 2020 10:00 IST|Sakshi

కస్టడీ డెత్‌: సీబీఐ విచారణలో విస్తుపోయే విషయాలు

చెన్నై: తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రీకొడుకులు జయరాజ్‌, బెనిక్స్‌ కస్టడీ డెత్‌ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మద్రాస్‌ హైకోర్టుకు నివేదిక అందజేసింది. ‘‘రిజల్ట్స్‌ ఆఫ్‌ లాబొరేటరి అనాలిసిస్‌’’ పేరిట రూపొందించిన ఫోరెన్సిక్‌ రిపోర్టును మధురై ధర్మాసనానికి సమర్పించింది. సత్తాన్‌కులం లాకప్‌, టాయిలెట్‌, ఎస్‌హెచ్‌ఓ గదిలోని గోడలపై సేకరించిన రక్త నమూనాలు, మృతుల డీఎన్‌ఏతో మ్యాచ్‌ అయినట్లు వెల్లడించింది. ఢిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరి నిపుణులు ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు పేర్కొంది.  ఈ మేరకు..‘‘సత్తాన్‌కులం పోలీస్‌ స్టేషన్‌లో 19.06.2020 రోజున సాయంత్రం బెనిక్స్‌, జయరాజ్‌లను, నిందితులైన పోలీసు అధికారులు అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. (చదవండి: అందుకే వాళ్లిద్దరూ మృతి చెందారు: సీబీఐ)

అదే రోజు రాత్రి మరోసారి తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలే వారి మృతికి కారణమయ్యాయి’’అని స్పష్టం చేసింది. ఇక బాధితులను తీవ్రంగా హింసించడమే గాకుండా, గాయాల వల్ల వారి శరీరం నుంచి కారిన రక్తం ఫ్లోర్‌పై పడితే, దానిని కూడా వారి దుస్తులతోనే శుభ్రం చేయాలంటూ అత్యంత పాశవికంగా ప్రవర్తించారని పేర్కొంది. ఇక కోవిల్‌పట్టి మెజిస్ట్రేట్‌ విచారణ, పోస్ట్‌మార్టం నివేదికలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించినట్లు చార్జిషీట్‌లో పొందుపరిచింది. (చదవండి: కస్టడీ డెత్‌: 9 మంది పోలీసులపై చార్జిషీట్‌)

ఆరోజు ఏం జరిగింది?
సీబీఐ నివేదికలోని వివరాల ప్రకారం.. జూన్‌ 19న ఎస్సై బాలక్రిష్ణన్‌, ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ శ్రీధర్‌, కానిస్టేబుల్‌ ఎం ముత్తురాజాతో పాటు మరికొంత మంది పోలీసులు కామరాజార్‌ చౌక్‌ వద్ద జయరాజ్‌ను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బెనిక్స్‌ వెంటనే సత్తానుకులం పోలీస్‌ స్టేషన్‌కు బయల్దేరి వెళ్లారు. తన తండ్రిని ఎందుకు కొడుతున్నారంటూ ఎస్సై బాలక్రిష్ణన్‌ను నిలదీశారు. దీంతో కోపోద్రిక్తులైన పోలీసులు అతడిపై కూడా దాడి చేయడం మొదలుపెట్టారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో కానిస్టేబుల్‌ను బెనిక్స్‌ నెట్టివేయడంతో మరింతగా రెచ్చిపోయారు. పోలీసులపై చేయి ఎత్తినందుకు తగిన గుణపాఠం చెబుతామంటూ బెనిక్స్‌ను తీవ్రంగా కొట్టారు. 

అలా కొన్ని గంటలపాటు జయరాజ్‌, బెనిక్స్‌లను చిత్ర హింసలకు గురిచేశారు. ఆ తర్వాత వారిద్దరి దుస్తులు విప్పించి, మళ్లీ కొట్టడం ప్రారంభించారు. చెక్కబల్లపై వారిని పడుకోబెట్టి, కాళ్లూ, చేతులూ వెనక్కి మడిచి పెట్టి లాఠీలతో తీవ్రంగా కొట్టారు. తమను విడిచిపెట్టాలని ఎంతగా ప్రాధేయపడినా కనికరం చూపలేదు. తీవ్రమైన గాయాల వల్లే వీరిద్దరు మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదిక కూడా స్పష్టం చేస్తోంది. కాగా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్‌ పట్టి సమీపంలోని సత్తాన్‌కుళానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్‌(59), బెనిక్స్‌(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టడంతో మరణించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం ఈ కేసు సీబీఐ చేతికి వచ్చింది. ఈ క్రమంలో జూలై 7న సీబీఐ రెండు కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా