విడాకులు కోరిందని.. యూఎస్‌ నుంచే భార్య హత్యకు స్కెచ్‌

29 May, 2021 17:28 IST|Sakshi

సినిమాను తలపించే క్రైం కథా చిత్రమ్‌

బావతో కలిసి భార్య హత్యకు ప్లాన్‌ చేసిన ఎన్నారై భర్త

చెన్నై: సినిమాను తలదన్నే రీతిలో భార్య హత్యకు ప్లాన్‌ చేశాడు ఓ ఎన్నారై భర్త.  తన బావ(సోదరి భర్త)తో కలిసి.. యాక్సిడెంట్‌ని తలపించేలా భార్యను హత్య చేశాడు. కానీ మృతురాలు కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సదరు ఎన్నారై భర్త దుష్ట పన్నాగం వెలుగులోకి వచ్చింది. మరణించని స్త్రీని జయభారతి(28)గా గుర్తించారు పోలీసులు. వివరాలు..

తమిళనాడు తిరువూరు జిల్లా, కిదరకొండం ప్రాంతానికి చెందిన జయభారతికి ఐదు సంవత్సరాల క్రితం విష్ణు ప్రకాశ్‌తో వివాహం అయ్యింది. అప్పటికే అతడు అమెరికాలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం అనంతరం జయభారతి కూడా అమెరికా వెళ్లింది. కానీ దంపతుల మధ్య వివాదాలు రావడంతో రెండేళ్ల క్రితం ఆమె తిరిగి ఇండియాకు వచ్చింది. ఇక్కడే స్థానికంగా ఉన్న పోస్టాఫీస్‌లో ఉద్యోగం చేస్తుంది. ఇరు కుటుంబాల పెద్దలు వీరిని కలపడానికి అనేకమార్లు ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం జయభారతి తన భర్త విష్ణుప్రకాశ్‌కి విడాకుల నోటీసు పంపింది.

అయితే విడాకులు ఇస్తే.. భారీ మొత్తంలో భరణం చెల్లించాల్సి వస్తుందని భయపడిన విష్ణు ప్రకాశ్‌, జయభారతి, ఆమె కుటుంబ సభ్యులను బెదిరించడం ప్రారంభించాడు. అయినప్పటికి విడాకులు వెనక్కి తీసుకోకపోవడంతో భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అమెరికాలో ఉండే ప్లాన్‌ చేసి.. బావతో కలిసి దాన్ని అమలు చేశాడు. ప్రమాదాన్ని తలపించేలా హత్య చేశాడు.. ఆ తర్వాత అడ్డంగా బుక్కయ్యాడు.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జయభారతి తన టూవీలర్‌పై ఆఫీస్‌కు వెళ్తుండగా.. వేగంగా వచ్చిన ట్రక్కు జయభారతి టూవీలర్‌ని ఢీ​కొట్టి రెప్పపాటులో అక్కడి నుంచి మాయమయ్యింది. ఇక రక్తపు మడుగులో పడి ఉన్న జయాభారతిని గమనించిన కొందరు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ జయభారతి మృతి చెందింది. ఈ క్రమంలో మృతురాలి కుటుంబ సభ్యులు ఇది ప్రమాదం కాదని.. కావాలనే యాక్సిడెంట్‌ చేశారని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జయ భారతి ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమరాలను పరిశీలించారు. అందులో ఓ ట్రక్కు కొన్ని రోజులుగా జయభారతిని వెంబడించినట్లు పోలీసులు గుర్తించారు. ట్రక్కు నంబర్‌ ఆధారంగా దాని యజమానిని గుర్తించి అదుపులోకి తీసుకోగా.. అతడు దాన్ని కొద్ది రోజుల క్రితమే వేరే వ్యక్తికి అమ్మానని తెలిపాడు. 

ఇంతలో పోలీసులు ట్రక్కులో తాము చూసిన ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసి విచారించగా.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. జయ భారతి భర్తే.. ఆమెను హత్య చేసేందుకు తమకు సుపారీ ఇచ్చాడని వెల్లడించాడు. అతడి ప్లాన్‌ ప్రకారమే ఆ ట్రక్కు యజమాని, విష్ణు ప్రకాశ్‌ సోదరి భర్త సెంథిల్‌ కుమార్‌‌ దానిని వేరే వ్యక్తికి అమ్మాడని.. ఆ తర్వాత మరో ఇద్దరని కలుపుకుని.. జయ భారతి వాహనానికి యాక్సిడెంట్‌ చేసి ఆమెను హత్య చేశాని ఆ నిందితుడు వెల్లడించాడు. 

కేవలం 12 గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును చేధించారు. సెంథిల్‌ కుమార్‌తో సహా మరో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. విష్ణు ప్రకాశ్‌ మీద కూడా కేసు నమోదు చేసి.. అతడిని ఇండియా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 

చదవండి: నడిరోడ్డుపై డాక్టర్​ దంపతుల హత్య.. ప్రతీకారంగానే!

మరిన్ని వార్తలు