karimnagar: బతుకునిచ్చే చెట్టుపైనే ఊపిరి పోయె..

16 Dec, 2021 10:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తంగళ్లపల్లి(కరీంనగర్‌): కుటుంబాన్ని పోషించేందుకు 20 ఏళ్లు గల్ఫ్‌ బాట పట్టిన ఇంటి పెద్ద.. ఇకపై కళ్లముందే ఉంటూ, తమను కంటికి రెప్పలా చూసుకుంటాడని భావించిన భార్యాబిడ్డల ఆశలు గల్లంతయ్యాయి. కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు అదే చెట్టుపై మరణించడంతో కుటుంబంతోపాటు గ్రామంలో విషా దం నెలకొంది.

పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన గుగ్గిళ్ల కిష్టయ్య గౌడ్‌ (59) బతుకుతెరువుకు 20 ఏళ్లుగా గల్ఫ్‌లో ఉన్నాడు. ఆరు నెలల క్రితమే గ్రామానికి వచ్చి కులవృత్తి చేసుకుంటూ ఉండిపోదామని నిర్ణయించుకున్నాడు. గౌడ సంఘంలో అతనికి 13 తాటి, 6 ఈత చెట్లను కేటాయించగా.. రెండు నెలలుగా కల్లుగీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

బుధవారం ఉదయం కల్లు గీసేందుకు గ్రామ శివారులోని తాటిచెట్టు ఎక్కాడు. చెట్టు దిగుతుండగా మోకు జారి చెట్టుపైనే వెనక్కి వంగిపోయాడు. ఎంత ప్రయత్నించినా పైకి లేవలేకపోయాడు. మోకు గట్టిగా బిగుసుకుపోవడంతో ఊపిరాడక చెట్టుపైనే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు.

పోలీసులు, గ్రామస్తులు జేసీబీ సా యంతో మృతదేహాన్ని చెట్టుపైనుంచి కిందకు దింపారు. మృతునికి భార్య పద్మ, నలుగురు కూతుళ్లు రజిత, నవ్య, కావ్య, స్వాతి, కొడుకు సాయి ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల వివాహాలు జరిగాయి. మూడో కూతురు హైదరాబాద్‌లోని ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. కవల పిల్లలైన స్వాతి, సాయి డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నారు. మృతుని భార్య పద్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. 

చదవండి: ఆ ఇమ్యూనిటీతో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే శక్తి వస్తుంది

మరిన్ని వార్తలు