మూడేళ్ల క్రితం డ్రగ్స్‌ తీసుకున్నా..

24 Sep, 2023 02:55 IST|Sakshi

ఈమధ్య కాలంలో మాదకద్రవ్యాలు తీసుకోలేదు 

డ్రగ్స్‌ తీసుకున్నట్లు రామ్‌చంద్‌ నా పేరు ఎందుకు చెప్పాడో తెలీదు 

తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో విచారణలో హీరో నవదీప్‌ వెల్లడి 

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ఆరోపణలపై దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు 

మొబైల్‌ఫోన్‌ స్వాదీనం, బ్యాంకు ఖాతా వివరాల సేకరణ 

ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలి వారంలో మళ్లీ విచారణ! 

హిమాయత్‌నగర్‌: మూడేళ్ల క్రితం డ్రగ్స్‌ తీసుకున్నానని... ఇటీవల కాలంలో ఎప్పుడూ వాటి జోలికి పోలేదని నటుడు నవదీప్‌ తెలంగాణ స్టేట్‌ నార్కోటిక్‌ బ్యూరో (టీఎస్‌ఎన్‌ఏబీ) అధికారులకు తెలిపాడు. ఇటీవల హైదరాబాద్‌ మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌ ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్‌ వ్యవహారంలో మరోమారు నవదీప్‌ పేరు తెరపైకి రావడం, అతడు సైతం డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా ఉన్నట్లు సీపీ, టీఎస్‌ఎన్‌ఏబీ డైరెక్టర్‌ సీవీ ఆనంద్‌ ప్రకటించిన నేపథ్యంలో టీఎస్‌ఎన్‌ఏబీ నుంచి నోటీసులు అందుకున్న హీరో నవదీప్‌ శనివారం ఉదయం 11 గంటలకు టీఎస్‌ఎన్‌ఏబీ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరయ్యాడు.

ఏసీపీ కె.నర్సింగరావుతో కలసి టీఎస్‌ఎన్‌ఏబీ (వెస్ట్‌) ఎస్పీ సునీతారెడ్డి నవదీప్‌ను దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం నవదీప్‌ మీడియాతో మాట్లాడుతూ నార్కోటిక్‌ బ్యూరో అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పానన్నాడు. మళ్లీ ఎప్పుడు పిలిచినా తాను వచ్చేందుకు సిద్ధమని తెలియజేశాడు.  

ఈమధ్య కాలంలో డ్రగ్స్‌ తీసుకోలేదు... 
డ్రగ్స్‌ వ్యవహారంలో రామ్‌చంద్‌ అనే వ్యక్తిని టీఎస్‌ఎన్‌ఏబీ పోలీసులు విచారించగా తన పేరు చెప్పాడని... అతనిచ్చిన వాంగ్మూలం మేరకు నార్కోటిక్‌ పోలీసులు ప్రశ్నించారని హీరో నవదీప్‌ వివరించాడు. తాను మూడేళ్ల క్రితం డ్రగ్స్‌ తీసుకున్నానే తప్ప ఇటీవల కాలంలో తీసుకోలేదన్నాడు. 15 ఏళ్లుగా పరిచయమున్న రామ్‌చంద్‌ ఏ కారణంతో తన పేరు చెప్పాడో తెలియదని పేర్కొన్నాడు.

డ్రగ్‌ పెడ్లర్లు వెంకటరమణారెడ్డి, బాలాజీలతో ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలంటూ నార్కోటిక్‌ పోలీసులు ప్రశ్నించగా 2017 నాటి డ్రగ్స్‌ కేసు విషయం, ఆనాటి పెడ్లర్ల ద్వారా వారు పరిచయమయ్యారని అతను చెప్పినట్లు తెలిసింది. 2017లో ఎక్సైజ్‌ అధికారులు విచారణకు పిలిచినప్పుడు వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పానని నవదీప్‌ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. 

ఆ 81 మందిపై ఆరా... 
హీరో నవదీప్‌ మొబైల్‌ను స్వా«దీనం చేసుకున్న నార్కోటిక్‌ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రధానంగా 81 ఫోన్‌ నంబర్లపై పోలీసులు దృష్టి సారించారు. అందులో డ్రగ్‌ పెడ్లర్లు, వినియోగదారుల పేర్లు ఉన్నట్లు నార్కోటిక్‌ పోలీసులు అభిప్రాయానికి వచ్చా­రు. దీంతో వారి గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. నవదీప్‌కు చెందిన ఎస్‌బీఐ ఖాతాను పరిశీలిస్తున్న పోలీసులు... ఎవరెవరితో లావాదేవీలు జరిగాయనే కోణంలో విచారిస్తున్నారు.

అదేవిధంగా అతని మొబైల్‌లోని స్నాప్‌చాట్, వాట్సాప్, టెలిగ్రామ్‌ చాట్‌లను పరిశీలిస్తున్నారు. డ్రగ్స్‌ కొను­గోలు, విక్రయాలు, అతను ఎవరెవరితో కలసి డ్రగ్స్‌ తీసుకున్నాడనే విషయాలన్నీ స్నాప్‌చాట్, టెలిగ్రామ్‌ల చాటింగ్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ నెలాఖరు లేదా అక్టోబర్‌ మొదటి వారంలో నవదీప్‌ను విచారణ నిమిత్తం పిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. 

భయం వేసి పారిపోయా.. 
డ్రగ్స్‌ తీసుకోకుంటే పారిపోవాల్సిన అవసరం ఏముందని ఎస్పీ సునీతారెడ్డి నవదీప్‌ను ప్రశ్నించగా మీడియాలో తాను డ్రగ్స్‌ తీసుకున్నట్లు పదేపదే వార్తలు రావడం వల్ల భయానికి గురయ్యానని హీరో నవదీప్‌ పేర్కొన్నట్లు తెలిసింది. మీడియా ఒత్తిడి వల్ల తనను నార్కోటిక్‌ బ్యూరో అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి పారిపోయినట్లు విచారణలో అతను చెప్పాడని సమాచారం.

45 మందికి తరచూ ఫోన్లు.. 
డ్రగ్స్‌ వ్యవహారంలో హీరో నవదీప్‌ను విచారించాం. మూడేళ్ల క్రితం డ్రగ్స్‌ తీసుకున్నానని చెప్పాడు. విచారణకు వచ్చే సమయంలో మొబైల్‌లోని డేటా అంతా తొలగించి.. తల్లికి చెందిన మొబైల్‌ ఫోన్‌తో వచ్చాడు. అతని మొబైల్‌ ఫోన్‌ గురించి ప్రశ్నించగా.. మరమ్మతుల్లో ఉందన్నాడు. దీనిపై క్రాస్‌ చెక్‌ చేయగా మొబైల్‌ షాప్‌ వ్యక్తి కూడా అదే సమాధానం ఇచ్చాడు. పాత, కొత్త మొబైల్‌తోపాటు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఇప్పటివరకు 81 లింకులను గుర్తించాం. వాటిలో ప్రధానంగా 45 మందికి నవదీప్‌ తరచూ ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు చేసేవాడు. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం     – ఎస్పీ సునీతారెడ్డి  
 

మరిన్ని వార్తలు