విద్యార్థిని దుర్మరణం.. పలు అనుమానాలు

11 Aug, 2020 11:48 IST|Sakshi

యూపీలో విషాదకర ఘటన

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. మారుమూల గ్రామం నుంచి అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ వరకు ప్రస్థానం కొనసాగించిన ఓ విద్యా కుసుమం నేల రాలిపోయింది. ఎదురుగా వచ్చిన బైకర్‌ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగా సంభవించిన రోడ్డు ప్రమాదం ఆమె ప్రాణాలను బలిగొంది. ఉన్నత విద్యనభ్యసించి తమకు మరిన్ని పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తుందనుకున్న కూతురు ఇలా హఠాన్మరణం చెందడంతో కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది. వివరాలు.. బులంద్‌షహర్‌ జిల్లాకు చెందిన సుదీక్ష భాటి(20) 2018లో సీబీఎస్‌సీ క్లాస్‌ 12 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. 98 శాతం మార్కులు సాధించి అమెరికాలోని మసాచుసెట్స్‌లో గల బాబ్సన్‌ కాలేజ్‌లో స్కాలర్‌షిప్‌నకు అర్హత సాధించింది. (యూపీలో దారుణం.. బీజేపీ కీలక నేత కాల్చివేత)

ఈ క్రమంలో అగ్రరాజ్యంలో విద్యనభ్యసిస్తున్న సుదీక్ష కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూన్‌లో భారత్‌కు తిరిగి వచ్చింది. ఆగష్టులో మళ్లీ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పత్రాల కోసం సోమవారం తన అంకుల్‌తో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి బయల్దేరింది. ఇంతలో ఓ ఆకతాయి వాళ్ల బైక్‌ను వెంబండించాడు. వివిధ రకాల స్టంట్లు చేస్తూ సుదీక్ష ఉన్న బైక్‌ను ఢీకొట్టడంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. (బాలికపై అత్యాచారం: నిందితుల ఊహా చిత్రాలు!)

సదరు బైకర్‌ కావాలనే తమ కూతురిని వెంబడించి యాక్సిడెంట్‌ చేశాడని సుదీక్ష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడికి తగిన శిక్ష వేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ట్రాఫిక్‌ జామ్‌ వల్ల ముందున్న బైకర్‌ సడన్‌గా బ్రేక్‌ వేయడంతోనే రెండు బైకులు ఒకదానికొకటి ఢీకొట్టాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించినట్లు బులంద్‌ షహర్‌ పోలీసులు తెలిపారు. సుదీక్షను ఎవరూ వేధించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు.

ఈ మేరకు ప్రమాదం జరిగిన సమయంలో ఘటనాస్థలిలో వ్యక్తిని విచారించామని.. అతడు వేధింపుల విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదంటూ ఓ వీడియోను విడుదల చేశారు. లోతుగా విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. అయితే సుదీక్ష కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటనే అని ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు