బాలింతను బలి తీసుకున్నారు

5 Aug, 2020 05:36 IST|Sakshi
రజిత పెళ్లి ఫొటో

భూతవైద్యం పేరిట చిత్రహింసలు 

కోమాలోకి వెళ్లిన రజిత 

చికిత్స పొందుతూ మృతి 

జైపూర్‌ (చెన్నూర్‌): భూతవైద్యం పేరిట చిత్రహింసలకు గురైన బాలింత చివరకు మృతి చెందింది. దెయ్యం పట్టిందని భూతవైద్యుడు ఆమెను తీవ్రంగా కొట్టడంతో కోమాలోకి వెళ్లిన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచింది. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం కుందారం గ్రామానికి చెందిన సెగ్యం మల్లేశ్‌ కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన రజితను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల క్రితం రజిత పండంటి పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి మల్లేశ్‌ కట్నం కోసం రజితను వేధించడం మొదలు పెట్టాడు.

అతడికి కుటుంబసభ్యులు కూడా జత కలిశారు. ఎలాగైనా రజితను వదిలించుకోవాలని పథకం రచించారు. రజితను దెయ్యం ఆవహించిందని, అందుకే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోందని ఇరుగు పొరుగు వారిని నమ్మించారు. అంతటితో ఆగక ఓ భూతవైద్యుడిని పిలిపించి మరీ చిత్రహింసలు పెట్టించారు. దెబ్బలు తాళలేక రజిత మంచంపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో కోమాలోకి వెళ్లిన ఆమెను ఈ నెల ఒకటిన కరీంనగర్‌లోని ప్రతిమ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న రజిత.. సోమవారం అర్ధరాత్రి కన్నుమూసింది. దీంతో తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన ఆ పసిపాప 3 నెలలకే అనాథగా మారింది. తల్లిపాల కోసం ఆ పసి హృదయం ఏడుస్తున్న సంఘటనను చూసి స్థానికుల గుండె తరుక్కుపోతోంది.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా